
పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి అందికీ తెలిసిన విషయమే. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకు పెద్దలు పాలు తాగడం అలవాటు చేస్తుంటారు. దీనివల్ల శరీరానికి బలం చేకూరుతుందని, ఎముకలు బలపడతాయని, బలహీనత తగ్గుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు. శరీర అవసరాలను తీర్చడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలు పాలల్లో దండిగా ఉండటమ అందుకు కారణం. అందుకే రోజువారీ ఆహారంలో పాలను ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. కానీ మారుతున్న జీవనశైలితో, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యల దృష్ట్యా పాలు అందరికీ మంచిది కాదని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో పాలు తాగిన తర్వాత కొందరికి జీర్ణ సమస్య వస్తున్నాయి. మరికొంత మందికి ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురై ఉండవచ్చు. కాబట్టి పాలు అందరినీ ఒకే విధంగా ప్రభావితం చేయవని అర్ధం చేసుకోవచ్చు. అయితే ఎవరికి పాలు ప్రయోజనకరంగా ఉంటాయి? ఎవరు వీటిని తీసుకోకూడదు? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ వైద్య విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి మాట్లాడుతూ.. పాలు అందరికీ ఒకే విధమైన ప్రయోజనాలను అందించవు. దీనికి ప్రధాన కారణం.. లాక్టోస్ ఎలర్జీ. ఈ పరిస్థితి ఉన్నవారిలో లాక్టేజ్ ఎంజైమ్ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది పాలను జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. ఇది గ్యాస్, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. కొంతమందికి పాల అలెర్జీ లేదా శ్లేష్మం లేదా కఫం సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇది జలుబు సంబంధిత లేదా శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది మంచిది కాదు. కొంతమందిలో పాలు తాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. జిడ్డుగల చర్మం, మొటిమలు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
పాలు తాగడం వల్ల కలిగే సమస్యలను నివారించడానికి పెరుగు, మజ్జిగ తీసుకవచ్చు. అలాగే లాక్టోస్ లేని పాలు కూడా తీసుకోవచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. పాలు తాగడం వల్ల చర్మం లేదా కడుపు సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.