
110 ఏళ్లు దాటి జీవించే ‘సూపర్ సెంటేనేరియన్ల’ శరీర తత్వం సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచిన మరియా బ్రన్యాస్ జన్యు అధ్యయనం ద్వారా వృద్ధాప్య జీవశాస్త్రంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె గుండె, మెదడు పనితీరుతో పాటు రోగనిరోధక శక్తి కూడా యువతకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటం విశేషం. సుదీర్ఘ కాలం ఆరోగ్యంగా జీవించాలనుకునే వారికి ఆమె శరీరంలో లభించిన ఆధారాలు ఎంతో కీలకమైనవి.
వృద్ధాప్యం అనేది అనివార్యమైనా, మరియా బ్రన్యాస్ వంటి వ్యక్తులు దానిని ఎలా వాయిదా వేయగలుగుతున్నారనే దానిపై స్పానిష్ శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం నిర్వహించారు. ఆమె మరణానికి ముందు సేకరించిన నమూనాల ద్వారా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
యువ కణాలు – అద్భుత ఆరోగ్యం: పరిశోధనల ప్రకారం, మరియా కణాలు ఆమె కాలక్రమానుసార వయస్సు కంటే చాలా తక్కువ వయస్సు ఉన్నవారి కణాల వలె ప్రవర్తిస్తున్నాయని తేలింది. ఆమె నివసించిన ప్రాంతంలోని మహిళల సగటు ఆయుర్దాయం కంటే ఆమె 30 ఏళ్లు అదనంగా జీవించారు. 117 ఏళ్ల వయస్సులో కూడా ఆమె గుండె ఎంతో ఆరోగ్యంగా ఉండటం.. శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు) స్థాయిలు చాలా తక్కువగా ఉండటం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసింది.
టెలోమియర్ల వింత ప్రవర్తన: సాధారణంగా క్రోమోజోమ్ల చివర ఉండే టెలోమియర్లు (Telomeres) వయస్సు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతాయి. టెలోమియర్లు తక్కువగా ఉంటే మరణ గండం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. అయితే మరియా విషయంలో టెలోమియర్లు బాగా క్షీణించినప్పటికీ, అదే ఆమెకు రక్షణ కవచంగా మారి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ చిన్న టెలోమియర్లు ఆమె శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుని ఉండవచ్చని ఒక అంచనా.
జన్యువులతో పాటు జీవనశైలి: ఆమె సుదీర్ఘ జీవితానికి అద్భుతమైన జన్యువులతో పాటు ఆమె సామాజికంగా, శారీరకంగా చురుగ్గా ఉండటం కూడా తోడ్పడింది. యోగర్ట్ ఎక్కువగా ఉండే మధ్యధరా ఆహారపు అలవాట్లు కూడా ఆమె ఆరోగ్యాన్ని కాపాడాయి. రక్తంలోని మంచి కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం ఆమె దీర్ఘాయువుకు చిహ్నాలుగా నిలిచాయి.
శాస్త్రవేత్తల ఈ పరిశోధన భవిష్యత్తులో మనుషుల ఆయుర్దాయాన్ని పెంచడానికి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని పొందే వ్యూహాలను రూపొందించడానికి ఎంతగానో ఉపయోగపడనుంది.