
మారుతోన్న కాలానికి అనుగుణంగా చివరికి వ్యాధులు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు అనారోగ్యం అంటే కేవలం శారీరక అనారోగ్యమే అనుకునే వాళ్లం కానీ ప్రస్తుతం మానసిక అనారోగ్యం కూడా పెరిగిపోతోంది. మారుతోన్న జీవనశైలి, వర్క్ కల్చర్ కారణంగా మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్న జీవితం ప్రజల ఆరోగ్యాలకు దెబ్బతీస్తున్నాయి.
అయితే మానసిక ఆరోగ్యం, శరీర బరువుల మధ్య సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వీటి మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మానసిక అనారోగ్యంతో బాధపడేవారిలో బరువు పెరిగే సమస్య ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. కుంగుబాటు లక్షణాలు ఎక్కువగా ఉన్న వారు బరువు పెరుగుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఇందులో భాగంగా కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు.
కరోనా సమయంలో ప్రతినెలా కొందరి మానసిక ఆరోగ్యాన్ని, బరువును పరిశీలించారు. ఆందోళన, ఒత్తిడి తీవ్రతను బట్టి మానసిక ఆరోగ్యాన్ని లెక్కించారు. కుంగుబాటు లక్షణాలు పెరుగుతున్నకొద్దీ ప్రతి నెలా 45 గ్రాముల బరువు ఎక్కువవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ఊబకాయ సమస్యతో బాధపడుతున్న వారిలోనే కుంగుబాటు, బరువు పెరగడం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ఇక సాధరణంగానే శరీర ఎత్తు, బరువు నిష్పత్తి (బీఎంఐ) ఎక్కువగా ఉండేవారికి మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనికి కుంగుబాటు కూడా తోడైదే మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. బరువు ఎక్కువగా ఉన్నవారు కుంగుబాటు లక్షణాలను నియంత్రణలో ఉంచుకుంటే మరింత బరువు పెరగకుండా చూసుకోవచ్చని.. ఇది శారీర, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుందని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..