
ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరిలో అలసట, బలహీనత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమస్య ఉదయం నిద్రలేచిన వెంటనే ప్రారంభమైతే.. మళ్లీ రాత్రి నిద్రపోయే వరకు ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ అటువంటి సమస్యల నుంచి బయటపడటానికి సులభమైన మార్గాన్ని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే.. ఈ అలసటను వదిలించుకోవడానికి వ్యాయామం, త్వరగా శక్తిని పొందడానికి చాలా మంది అరటిపండ్లు లేదా ఖర్జూరాలు తీసుకుంటూ ఉంటారు. కానీ వీటిలో ఏది ఉత్తమమో, ఏ సమయంలో ఏది తినాలో తప్పక తెలుసుకోవాలి. తద్వారా మీరు రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ఈ రెండు ఆహారాల మధ్య తేడా ఏమిటో, ఆరోగ్యానికి ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..
ఒక అరటిపండులో దాదాపు 105 కేలరీలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అరటిపండ్లతో పోలిస్తే, ఖర్జూరం కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కేవలం మూడు లేదా నాలుగు ఖర్జూరాలు తినడం వల్ల మీకు 90 నుంచి 120 కేలరీల శక్తి లభిస్తుంది. అంతే కాదు వాటిలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకునేవారికి లేదా రోజంతా ఉత్సాహంగా పనిచేయాలనుకునే వారికి, అరటిపండ్లు మంచివి. వాటిలోని ఫైబర్ చక్కెరను నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తుంది. తద్వారా ఎక్కువ సమయం శక్తిని అందించడానికి సహాయపడుతుంది.
వ్యాయామం తర్వాత అలసిపోయినా లేదా నీరసంగా అనిపించినా తక్షణ శక్తి కోసం ఖర్జూరం తినడం మంచిది. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. శరీరానికి వెంటనే గ్లూకోజ్‌ను అందిస్తుంది. అందుకే ఉపవాసం ఉన్నవారు ఖర్జూరాన్ని తినేందుకు ఇష్టపడతారు. కానీ డయాబెటిస్ ఉన్నవారు వీలైనంత వరకు ఖర్జూర వినియోగాన్ని నియంత్రించుకోవాలి. కండరాల తిమ్మిరితో బాధపడేవారు కూడా ఖర్జూరం తినవచ్చు. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
శరీర అవసరాలను బట్టి అరటి పండు, ఖర్జూరం రెండూ మంచివే. ఎక్కువసేపు పనిచేయాలనుకుంటే అరటిపండ్లు తినండి. తక్షణ శక్తి కోసం ఖర్జూరం తినండి. కానీ ప్రతిదీ మితంగానే ఉండాలి. ఏదైనా అధికంగా తినడం అంత మంచిది కాదు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.