మధుమేహం.. మన దేశంలో అత్యంత సాధారణమైన వ్యాధి. చాలా మంది దీనిని లైట్ తీసుకుంటారు. అసలు చికిత్స కూడా చేయించుకోరు. దీనికి ప్రధాన కారణంగా ఈ చక్కెర వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడమే. ఎందుకంటే అది శరీరానికి, ఆరోగ్యానికి చేసే నష్టం తెలిస్తే ఇలా లైట్ తీసుకోలేరు. కంట్రోల్లో లేని షుగర్ లెవల్స్ వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కిడ్నీలు పాడవుతాయి.. కాళ్లకు పుండ్లు ఏర్పడతాయి.. అన్నీ కలిసి మనిషి ఆయుర్ధానాన్ని సగానికి తగ్గించేస్తాయి. అందుకే ఈ వ్యాధిపై సరైన అవగాహన, సమయానుగుణమైన చికిత్స, నిపుణుల పర్యవేక్షణ అవసరం. ఈ నేపథ్యంలో సాధారణంగా మన దేశంలో ఈ వ్యాధిపై ఉన్న అపోహలు వాటి వివరణలను ఇప్పుడు చూద్దాం..
మన భారతదేశంలో దాదాపు 77 మిలియన్ల మంది ఈ మధుమేహం బాధితులు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాక దాదాపు 57 శాతం మందికి అసలు తమకు ఆ వ్యాధి ఉన్నట్లు కూడా వారికి అవగాహన కూడా లేదని వివరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్లక్ష్యమేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే చెల్లుబాటులో ఉన్న కొన్ని అపోహలు, అవగాహన లేమి అని వివరిస్తున్నారు. దీని కారణంగా సక్రమంగా మందులు వాడకపోవడం, చికిత్స పద్ధతులను సక్రమంగా పాటించకపోవడం, డైట్ అమలు చేయకపోవడం చేస్తున్నారని చెబుతున్నారు.
చక్కెర అధిక వినియోగంతోనే షుగర్ వస్తుంది.. మధుమేహం అనేది అనేక అంశాలకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితి. వీటిలో అధిక బరువు లేదా ఊబకాయం, నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి కారణాలు ఉంటాయి. అలాగే మధుమేహం ఉన్న కుటుంబ చరిత్ర వంటి జన్యుపరమైన కారకాలు కూడా ప్రభావితం చేస్తాయి. మధుమేహం ఉన్నవారు తరచుగా చక్కెర తీసుకోవడం నియంత్రించాలని సలహా ఇస్తారు గానీ కేవలం ఎక్కువ చక్కెరను తినడం వల్ల మధుమేహం రాదు. అయినప్పటికీ, మీ చక్కెర వినియోగాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే చక్కెరతో కూడిన ఆహారంలో అధిక కేలరీలు ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. తత్ఫలితంగా మీ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
మధుమేహం నయం అవుతుంది.. అరుదైన సందర్భాల్లో మధుమేహం నయం అవుతుంది. కానీ చాలా సందర్భాలలో ఒకసారి మధుమేహం వచ్చిదంటే జీవితాంతం ఉండే పరిస్థితి. కానీ మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. వైద్యులు సూచించిన మందులు వాడుతూ సమతుల్య ఆహారం, నిపుణుల సూచనల మేరకు జీవనశైలి మార్పులను అలవర్చుకోవడం వంటి వాటి ద్వారా షుగర్ ను అదుపులో ఉంచుకొని చక్కగా జీవించవచ్చు.
దాని ప్రభావం కొంత వరకే.. మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీనిని అదుపులో ఉంచుకోకపోతే గుండె, కన్ను, మూత్రపిండాలు, నరాలు లేదా పాదాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్యలను గుర్తిస్తే వెంటనే చికిత్స ప్రారంభించాలి. లేకుంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది.
అన్ని రకాల మధుమేహ వ్యాధులు ప్రమాదకరం కాదు.. మధుమేహం టైప్-1, టైప్-2 , జెస్టేషనల్ (గర్భధారణ సమయంలో) వంటి విభిన్న రకాలు ఉన్నప్పటికీ.. దీనిలో ఏది తక్కువ ప్రమాదకరం అన్న విషయాలను అంచనా వేయలేం. అన్ని రకాల మధుమేహంలోనూ, అనియంత్రిత కేసులు తీవ్రమైన, దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చు. అయినప్పటికీ, మధుమేహం ఉన్న వ్యక్తులు సరైన మధుమేహ నిర్వహణతో ఆరోగ్యకరమైన, మెరుగైన జీవితాన్ని గడపవచ్చు.
ఆహారం, జీవనశైలి మార్చుకుంటే చాలు.. మీ రక్తంలో గ్లూకోజ్‌ని పెంచే కొన్ని ఆహారపదార్థాల తీసుకోవడం తగ్గించడం, ఆరోగ్యకరమైన ఫిట్‌నెస్ దినచర్యను అనుసరించడం మధుమేహాన్ని నియంత్రించడానికి కీలకమైన దశలు. అయితే ఈ చర్యలు మాత్రమే ప్రజలందరికీ సరిపోతాయా అంటే అలా అనడం కూడా సరికాదు. వీటితో పాటు నిరంతర వైద్యుల పర్యవేక్షణ, రెగ్యూలర్ చెకప్స్, సక్రమంగా మందులు వాడటంతో పాటు పై వన్నీ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..