
లవంగాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. లవంగాలు (Cloves) మాంగనీస్, విటమిన్ K, విటమిన్ C, ఫైబర్‌తో కూడిన అత్యంత పోషకమైన సుగంధ ద్రవ్యాలుగా పరిగణిస్తారు. దీనిలోని యూజెనాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఎన్నో సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే.. వంటకాలకు సువాసన, రుచిని అందించే లవంగాలు మన దైనందిన ఆహారంలో ఒక భాగం.. అయితే, లవంగాలు ఎక్కువైతే పొట్టలో మంట, అసౌకర్యం, అల్సర్‌లు వంటి సమస్యలు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. ఇది కొంతమందిలో వేడి చేసిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. అయితే, లవంగాలపై జరిగిన శాస్త్రీయ పరిశోధనలు ఈ అపోహను పాక్షికంగా తొలగిస్తూ ఒక కీలకమైన వాస్తవాన్ని వెల్లడించాయి. లవంగాలు సరైన మోతాదులో ఉపయోగించినప్పుడు, అవి పొట్టలో, అన్నవాహికలో (ఆహార నాళం) అల్సర్‌లు ఏర్పడకుండా అద్భుతంగా రక్షించగలవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
లవంగాలలో ఉండే ప్రత్యేకమైన ఘాటుకు కారణమైన రసాయన సమ్మేళనాలు.. మనం తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థలోని జిగురు పొరలను (mucous membranes) ఉత్తేజపరుస్తాయి. ఈ ప్రేరణ వల్ల జిగురును ఉత్పత్తి చేసే కణజాలం క్రియాశీలమై, కడుపు, అన్నవాహిక గోడలపై రక్షణ కవచంలా పనిచేసే జిగురు ఎక్కువగా స్రవించేలా చేస్తుంది. ఈ జిగురు పెరగడం వల్ల కడుపులో మంటలు, అల్సర్‌లు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. ఎర్ర కారం వంటి వాటి ఘాటుకు ఇలాంటి రక్షణ యంత్రాంగం ఉండదు.. కానీ లవంగాల ఘాటుకు ఈ విశిష్ట ప్రయోజనం ఉంది.
అయితే, ఈ ప్రయోజనం మోతాదుకు లోబడి ఉంటుంది. మూడు లేదా నాలుగు లవంగాలను మించి వాడకుండా ఉంటేనే పొట్టలో, అన్నవాహికలో అల్సర్‌ల నుండి రక్షణ లభిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ మోతాదుకు మించి, అనగా నాలుగైదు లవంగాల కంటే ఎక్కువ వాడినప్పుడు, లవంగాలలో ఉండే రసాయన ప్రభావం అధికమై రివర్స్ సైడ్ ఎఫెక్ట్‌లకు దారితీస్తుంది. ఈ అధిక ప్రభావం వల్ల మంట, ఇరిటేషన్ ఎక్కువైపోయి అసౌకర్యం కలుగుతుంది.
ఈ పరిశోధనల వివరాలను 2014వ సంవత్సరంలో బ్రెజిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సావోపాలో అందించింది. అందుకనే, లవంగాలు రోజూ వాడితే మంటలు, అల్సర్‌లు వస్తాయనే అపోహ ఉన్నప్పటికీ, సరైన మోతాదులో ఉపయోగించడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. చాలామంది వెజిటేరియన్ వంటకాల్లో లవంగాలు లేకుండా మసాలాలు వాడతారు.. అయితే ప్రత్యేక వంటకాల్లో, ముఖ్యంగా నాన్-వెజ్ వంటకాల్లో గుమగుమలాడే రుచి కోసం లవంగాలు వాడుతుంటారు. కానీ, తగు రీతిలో వాడుకున్నప్పుడు మాత్రమే లవంగాల వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందగలమని ఈ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే మోతాదుకు మించకుండా లవంగాలను వాడకూడదు..
అయితే లవంగాలు వేడి స్వభావాన్ని కలిగి ఉ:టాయి.. రోజుకు ఒకటి – రెండు తిన్నా కూడా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..