
కష్టపడి పనిచేయడం విజయంలో ఒక భాగం మాత్రమే.. సరైన ప్రణాళికే విజయానికి సంపూర్ణ మార్గం అని చాణక్యుడు అంటాడు. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని లేదా ఎంత కష్టపడినా సక్సెస్ రావడం లేదని బాధపడేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూత్రాలను వివరించారు. ఈ అలవాట్లు మీ జీవితాన్ని మార్చడమే కాకుండా మిమ్మల్ని అత్యంత సంపన్నులుగా తీర్చిదిద్దుతాయి.
మీరు రోజంతా ఏం చేశారు? ఏ ఏ పనుల్లో విజయం సాధించారు? ఎక్కడ తప్పులు చేశారు? అనే విషయాలను రాత్రి పడుకునే ముందు ఒక్కసారి నెమరువేసుకోవాలి. తన తప్పులను తనే సమీక్షించుకునే వ్యక్తి ఎప్పటికీ విఫలం కాడని చాణక్యుడు అంటాడు. నేటి తప్పులను రేపు సరిదిద్దుకోవడమే విజయానికి తొలిమెట్టు.
చాణక్యుడి ప్రకారం జ్ఞానమే అసలైన సంపద. పడుకునే ముందు కనీసం 15-20 నిమిషాల పాటు మీ రంగానికి సంబంధించిన పుస్తకాలను చదవండి. నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్నవారినే లక్ష్మీ దేవి వరిస్తుంది.
ఉదయం లేవగానే ఈరోజు ఏం చేయాలి? అని ఆలోచించడం కంటే రాత్రి పడుకునే ముందే టు డూ లిస్ట్ సిద్ధం చేసుకోవడం మేలని చాణక్యుడు సూచించాడు. స్పష్టమైన అజెండా ఉన్న వ్యక్తి సమయాన్ని వృథా చేయడు. తద్వారా లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటాడు.
నిద్రపోయే ముందు మీ భవిష్యత్తు లక్ష్యాలను ఒక్కసారి ఊహించుకోండి. మీ మనస్సు ఎప్పుడూ లక్ష్యంపైనే కేంద్రీకృతమై ఉండాలి. స్పష్టమైన గోల్ ఉన్న వ్యక్తిని ఓటమి భయపెట్టలేదు.
రోజంతా జరిగిన ప్రతికూల సంఘటనలను పక్కన పెట్టి, సానుకూల ఆలోచనలతో నిద్రపోండి. మంచి ఆలోచనలతో నిద్రపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మరుసటి రోజు మీరు రెట్టింపు ఉత్సాహంతో పని చేయడానికి శక్తిని ఇస్తుంది.