ఖాళీ కడుపుతో ఈ పని అస్సలు చేయకండి.. లైట్ తీసుకుంటే మీ హెల్త్ పని అయిపోయినట్లే..

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి వర్కౌట్స్ చాలా మంది జీవితంలో ఒక ముఖ్య భాగం. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేయాలా.. లేక ఏదైనా తిన్న తర్వాతే వ్యాయామం ప్రారంభించాలా? అనే డౌట్ చాలా మందిని వేధిస్తుంటుంది. వ్యాయామం నుండి ఆశించిన ఫలితాలు రావాలన్నా, శరీరం దెబ్బతినకుండా ఉండాలన్నా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖాళీ కడుపుతో ఈ పని అస్సలు చేయకండి.. లైట్ తీసుకుంటే మీ హెల్త్ పని అయిపోయినట్లే..
Can You Exercise On An Empty Stomach

Updated on: Jun 26, 2026 | 7:47 AM

కరోనా తర్వాత శారీరక ఫిట్‌నెస్, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. ఇందులో భాగంగానే రెగ్యులర్‌గా వ్యాయామాలు చాలా మంది దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే వర్కవుట్స్ చేసే విషయంలో ఇప్పటికీ చాలా మందిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. కొంతమంది ఉదయాన్నే నిద్రలేవగానే ఏమీ తినకుండా వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. మరికొందరు మాత్రం వ్యాయామానికి ముందు ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకోవడం తప్పనిసరి అని భావిస్తారు. ఈ నేపథ్యంలో వ్యాయామం చేయడానికి అసలు సరైన మార్గం ఏమిటి? ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేయడం సురక్షితమేనా? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అందరికీ ఒకే నియమం వర్తించదు..

నిజానికి, వ్యాయామానికి ముందు ఆహారం తీసుకోవాలా వద్దా అనే ప్రశ్నకు సమాధానం అందరికీ ఒకేలా ఉండదు. ఎందుకంటే ఇది ఒకరి ఆరోగ్య స్థితి, వారి ఫిట్‌నెస్ లక్ష్యాలు, వారు చేసే వర్కౌట్ రకంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి శరీర తత్వం, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి ఒకే నియమాన్ని అందరికీ వర్తించదు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ మార్గదర్శకాల ప్రకారం.. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం అనేది ఆయా వ్యక్తుల ఆరోగ్యం, వారు ఎంత సమయం వ్యాయామం చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువసేపు లేదా అత్యంత తీవ్రమైన వ్యాయామాలు చేసేవారికి శరీరానికి తగినంత శక్తి అవసరం. కాబట్టి వారు ఖాళీ కడుపుతో చేయడం అంత మంచిది కాదు. అదే సమయంలో తక్కువ సమయం పాటు తేలికపాటి శారీరక కార్యకలాపాలు లేదా నడక వంటివి చేసేవారు ఏమీ తినకుండా కూడా చేయవచ్చు.

ఖాళీ కడుపుతో చేయడం వల్ల కలిగే నష్టాలు..

శరీరంలో తగినంత శక్తి లేకుండా వ్యాయామం చేయడం వల్ల కొంతమందిలో ప్రతికూల ప్రభావాలు కనిపించవచ్చు.

నీరసం, అలసట: శరీరానికి తగినంత గ్లూకోజ్ అందకపోవడం వల్ల త్వరగా అలసిపోవడం, నీరసం రావడం, తల తిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

పనితీరు తగ్గడం: ఎనర్జీ లేకపోవడం వల్ల వ్యాయామంపై పూర్తి ఏకాగ్రత పెట్టలేరు. దీనివల్ల వర్కవుట్ పనితీరు గణనీయంగా తగ్గుతుంది.

షుగర్ లెవెల్స్ పడిపోవడం: అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు ఖాళీ కడుపుతో చేసినప్పుడు కొంతమందిలో రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది.

ఒకవేళ ఎవరికైనా షుగర్ లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే వారు ఖాళీ కడుపుతో వ్యాయామం ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని లేదా ఫిట్‌నెస్ నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

వ్యాయామానికి ముందు ఏం తినాలి?

వ్యాయామం ద్వారా పూర్తి ఫలితాలు పొందాలంటే వర్కవుట్‌కు ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం.

తేలికపాటి ఆహారం: వ్యాయామానికి కాస్త ముందు సులభంగా జీర్ణమయ్యే అరటిపండు, ఓట్స్, పెరుగు, పండ్లు లేదా తృణధాన్యాలు వంటి లైట్ స్నాక్స్ తీసుకోవడం మంచిది. ఇది శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని ఇస్తుంది.

భారీ భోజనం వద్దు: కడుపు నిండా భారీగా భోజనం చేసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం చేయకూడదు. భోజనానికి, వ్యాయామానికి మధ్య తగినంత సమయం ఉండాలి.

హైడ్రేషన్ ముఖ్యం: వ్యాయామం చేసే సమయంలో బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ముందుగానే పుష్కలంగా నీరు త్రాగడం చాలా ముఖ్యం.

ఫిట్‌నెస్ విషయంలో శరీరానికి ఇచ్చే శిక్షణ ఎంత ముఖ్యమో, దానికి అందించే పోషకాహారం కూడా అంతే ముఖ్యం. కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు మీ శరీరంలో ఎలాంటి అసౌకర్యం లేదా ఇబ్బంది అనిపించినా వెంటనే వర్కవుట్ ఆపేసి, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 

గమనిక: ఈ అంశాలు కేవలం సమాచారం, అవగాహన కోసం మాత్రమే. వీటిని వైద్య లేదా ఫిట్‌నెస్ సలహాగా పరిగణించరాదు. మీ ఆరోగ్య స్థితిని బట్టి ఏదైనా కొత్త ఫిట్‌నెస్ ప్లాన్‌ను ప్రారంభించే ముందు సర్టిఫైడ్ నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Follow Us