
బట్టలను ఉతికేటప్పుడు చివరగా ఒక టబ్బు నీటిలో నిమ్మరసాన్ని కలిపి బట్టలను అందులో ముంచి తీసేయండి. లేకపోతే స్ప్రే బాటిల్ లో నిమ్మరసం వేసి తడి బట్టలపై పిచికారీ చేయండి. నిమ్మరసం యాసిడిక్ లక్షణాలు బ్యాక్టీరియాను తొలగించి చెడు వాసనను నివారించడంలో సహాయపడతాయి.
ఎండ లేకపోయినా ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ డ్రైయర్ లేదా టేబుల్ ఫ్యాన్ సహాయంతో బట్టలను వేగంగా ఆరబెట్టవచ్చు. బట్టలపై నేరుగా గాలి వచ్చేలా స్టాండ్ ఉంచితే బాగా ఆరుతాయి. తేమ ఉండకపోవడం వల్ల చెడు వాసన క్రమంగా తగ్గుతుంది.
నిమ్మ, లావెండర్ లేదా టీ ట్రీ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కొన్ని చుక్కలు నీటిలో కలిపి స్ప్రే బాటిల్ లో వేసి బట్టలపై స్ప్రే చేయండి. ఇవి బాక్టీరియా వ్యతిరేక లక్షణాలతో పాటు బట్టలకు మంచి వాసనను కూడా ఇస్తాయి.
చాలా మంది బట్టలు ఆరిన వెంటనే మడతపెట్టి నిల్వ చేస్తారు. అయితే కొన్నిసార్లు అవి పూర్తిగా పొడిగా లేకపోవచ్చు, కొద్దిగా తేమ మిగిలి ఉండే అవకాశముంది. అందువల్ల బట్టలు పూర్తిగా ఆరిన తర్వాత వాటిని ఐరన్ చేసి పెట్టుకుంటే మిగిలిన తేమ కూడా తొలగిపోతుంది. దీని వలన దుర్వాసన వచ్చే సమస్య లేకుండా ఉంటుంది.
బట్టలు తడిగా ఉండకుండా చూడాలంటే గాలి బాగా వచ్చే స్థలంలోనే ఆరబెట్టాలి. ఫ్యాన్ కింద, కిటికీ దగ్గర లేదా బాల్కనీ లాంటి ప్రదేశాలు దీనికి అనుకూలం. నలువైపులా గాలి చేరేలా స్టాండ్ ను పెట్టడం వల్ల బట్టలు త్వరగా ఆరుతాయి.
బట్టలపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి దాన్ని దాదాపు 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ పొడిని నెమ్మదిగా దులిపి బట్టలను ఉతికితే మురికి తొలగిపోవడమే కాదు.. దుర్వాసన కూడా తగ్గుతుంది. బేకింగ్ సోడా సహజ డియోడరైజర్ లా పనిచేసి బట్టలను తాజాగా ఉంచుతుంది.
వెనిగర్ లోని యాసిడ్ లక్షణాలు చెడు వాసనలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తుడిచిపెట్టేస్తాయి. ఒక స్ప్రే బాటిల్ లో వెనిగర్, నీరు కలిపి తడిగా ఉన్న బట్టలపై స్ప్రే చేయండి. అలా చేస్తే బట్టల నుంచి త్వరగా చెడు వాసన పోయి శుభ్రమైన వాసన వస్తుంది.
బట్టలను నిల్వ చేసేటప్పుడు గాలి చొరబడే ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్లు వాడకుండా.. ఓపెన్ షెల్ఫ్‌లలో ఉంచడం మంచిది. అదే సమయంలో దుస్తుల దగ్గర డాంబర్ గోలీలు ఉంచితే అవి తేమను పీల్చుకుని, చెడు వాసనను నివారిస్తాయి.
వానాకాలంలో బట్టల దుర్వాసన తప్పదు అనుకోవద్దు. ఇక్కడ ఇచ్చిన ఇంటి చిట్కాలను పాటిస్తే.. మీరు మీ దుస్తులను ఎప్పటికీ తాజాగా స్వచ్ఛంగా ఉంచుకోవచ్చు. ఈ చిట్కాలు ఆరోగ్యానికి హానికరం కాకుండా.. సహజ పదార్థాలతో మీ సమస్యను పరిష్కరిస్తాయి.