
ఇళ్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడానికి లేదా బేకింగ్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ రోల్‌ను విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే, ఫాయిల్ చుట్టేటప్పుడు ఒకవైపు మెరుస్తూ, మరొకవైపు మ్యాట్ లేదా డల్ గా ఉండటంతో ఏ వైపు వాడాలో చాలామందికి సందేహం వస్తుంది. నిజానికి, ఈ రెండు వైపులా తయారీ ప్రక్రియ వల్ల మాత్రమే అలా కనిపిస్తాయి తప్ప ఆహారం ఉడకడంలో లేదా వేడిగా ఉంచడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మీరు ఏ వైపు ఉపయోగించినా ఆహారం సురక్షితంగానే ఉంటుంది. అయితే ప్రత్యేకంగా నాన్-స్టిక్ ఫాయిల్ వాడేటప్పుడు మాత్రం ప్యాకెట్ పై ఉన్న సూచనల ప్రకారం నాన్-స్టిక్ వైపునే ఆహారాన్ని ఉంచాలి.
అల్యూమినియం ఫాయిల్ తయారీ విధానం వల్ల ఈ వ్యత్యాసం ఏర్పడుతుంది. ఫాయిల్‌ను తయారుచేసే సమయంలో యంత్రాల్లో రెండు పొరలను ఒకేసారి రోలర్ల మధ్య గుండా పంపుతారు. రోలర్‌తో నేరుగా స్పర్శ కలిగే వైపు బాగా మెరుస్తూ తయారవుతుంది. మరొక పొరతో కలిసే భాగం మ్యాట్ లేదా డల్‌గా మారుతుంది. అంతేకానీ, ఇది ఆహారాన్ని వేడి చేసే సామర్థ్యంలో ఎలాంటి వ్యత్యాసాన్ని చూపదు.
ఫాయిల్ తయారీ కంపెనీలు, నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. మెరిసే వైపు అయినా, డల్ వైపు అయినా ఆహారాన్ని ప్యాక్ చేయడానికి లేదా బేకింగ్ చేయడానికి సమానంగా పనిచేస్తాయి. మెరిసే భాగం వేడిని ఎక్కువ ప్రతిబింబిస్తుందని కొందరు అనుకుంటారు, కానీ ఆ వ్యత్యాసం చాలా స్వల్పం. కాబట్టి మీరు ఏ వైపు నుంచి ఆహారాన్ని చుట్టినా ఏమీ కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నాన్-స్టిక్ ఫాయిల్: సాధారణ ఫాయిల్ అయితే ఏ వైపు వాడినా పర్వాలేదు, కానీ ఒకవేళ మీరు నాన్-స్టిక్ ఫాయిల్ ఉపయోగిస్తుంటే మాత్రం ఆహారాన్ని నాన్-స్టిక్ కోటింగ్ ఉన్న వైపునే ఉంచాలి.
ఆవిరి బయటకు పోకుండా చూడడం: ఫాయిల్ ఎక్కడైనా చిరిగిపోయినా లేదా సరిగ్గా మూసివేయకపోయినా వేడి మరియు ఆవిరి బయటకు పోతాయి. కాబట్టి బేకింగ్ లేదా రోస్టింగ్ చేసేటప్పుడు అంచులను బాగా మడిచి మూసివేయాలి.
కాల్చే ప్రమాదం: వేడివేడి ఆహారాన్ని ఫాయిల్‌లో చుట్టిన తర్వాత వెంటనే తెరవకూడదు. లోపల ఉండే వేడి ఆవిరి చేతికి లేదా ముఖానికి తగిలి కాలే ప్రమాదం ఉంది. కొద్దిసేపు చల్లారిన తర్వాతే తీయాలి. అల్యూమినియం ఫాయిల్ ఏ వైపు వాడినా భయపడాల్సిన అవసరం లేదు. వంటల్లో లేదా ఫుడ్ ప్యాకింగ్‌లో రెండు వైపులా సమానమైన ఫలితాన్నే ఇస్తాయి.