
ఇల్లు అనగానే బెడ్‌రూమ్, వంటింటి శుభ్రతపై చూపించే శ్రద్ధ చాలామంది బాత్రూమ్ విషయంలో చూపరు. నిజానికి బాత్రూమ్ అనేది కేవలం స్నానం చేసే గది మాత్రమే కాదు అది మన ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటిది. అయితే తెలియక మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లు.. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను బాత్రూమ్‌లో ఉంచడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాత్రూమ్‌లో ఉండే అధిక తేమ, మారుతున్న ఉష్ణోగ్రతల వల్ల అక్కడ బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో బాత్రూమ్‌లో అస్సలు ఉంచకూడని 8 ముఖ్యమైన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామంది మహిళలు బాత్రూమ్ అద్దం ముందే మేకప్ సామాగ్రిని వదిలేస్తుంటారు. తేమ కారణంగా పౌడర్లు గడ్డకట్టడమే కాకుండా లిప్‌స్టిక్‌లు, ఫౌండేషన్లలో బ్యాక్టీరియా చేరి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
మందుల పెట్టెలను బాత్రూమ్ క్యాబినెట్లలో ఉంచడం పెద్ద పొరపాటు. తేమ, వేడి వల్ల మందుల పనితీరు తగ్గిపోతుంది. అవి గడువు తేదీ కంటే ముందే పాడైపోయే అవకాశం ఉంది. వీటిని బెడ్‌రూమ్‌లో పొడిగా ఉండే చోట ఉంచడమే సురక్షితం.
స్నానం అయ్యాక తువ్వాళ్లను బాత్రూమ్‌లోనే హ్యాంగర్‌కు తగిలిస్తుంటారు. ఇది బూజు, బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల తువ్వాళ్ల నుండి వింత వాసన రావడమే కాకుండా చర్మ అలర్జీలు రావచ్చు. తువ్వాళ్లను ఎల్లప్పుడూ ఎండలో ఆరబెట్టాలి.
ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లడం వల్ల వాటి అంతర్గత సర్క్యూట్లు తేమ కారణంగా దెబ్బతింటాయి. ఇది షార్ట్ సర్క్యూట్‌కు దారితీయడమే కాకుండా పరికరం జీవితకాలాన్ని తగ్గిస్తుంది.
బాత్రూమ్‌లోని గాలిలో ఉండే తేమ వల్ల కొత్త బ్లేడ్లు కూడా త్వరగా తుప్పు పడతాయి. తుప్పు పట్టిన రేజర్లను వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు లేదా టెటనస్ వచ్చే ప్రమాదం ఉంది.
బంగారం, వెండి నగలను బాత్రూమ్‌లో ఉంచితే ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతమై అవి త్వరగా నల్లగా మారుతాయి. వాటి మెరుపును కోల్పోకుండా ఉండాలంటే లాకర్‌లో భద్రపరచడం మేలు.
ఉష్ణోగ్రతలో వచ్చే మార్పుల వల్ల నెయిల్ పాలిష్ మందంగా, జిగటగా మారిపోతుంది. దీనివల్ల అది వాడటానికి వీలు లేకుండా తయారవుతుంది. టిష్యూ పేపర్లు గాలిలోని తేమను త్వరగా పీల్చుకుంటాయి. ఫలితంగా అవి తడిగా మారి క్రిములకు నిలయంగా మారుతాయి. ఇది పరిశుభ్రతకు విఘాతం కలిగిస్తుంది.
బాత్రూమ్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలి. బాత్రూమ్ తలుపులను మూసి ఉంచడం వల్ల దుర్వాసన బయటకు రాకుండా ఉంటుంది. కానీ లోపల ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడటం వల్ల తేమను త్వరగా తగ్గించవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..