మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో గడచిన ఐదేళ్లో అరకొర తాత్కాలిక భవనాలకు మాత్రమే వాస్తవ రూపం ఇవ్వగలిగారు. అయితే బాబు చూపించిన గ్రాఫిక్స్ తో అమరావతే ఏపీ రాజధాని అన్న సెంటిమెంట్ కొందరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. వెరసి తాజాగా అమరావతి రైతులు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికార వికేంద్రీకరణతోనే ఏపీ సంపూర్ణాభివృద్ధి సాధ్యమని జీఎస్ రావు కమిటీతో పాటు వైసీపీ ప్రభుత్వం, పలు కమిటీలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.
ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ మూడు రాజధానుల ప్రాధాన్యతను తెలియజేస్తూ పలు కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రకారం తన కార్యాచరణ ప్రణాళికను వెల్లడించింది. మూడు రాజధానులను ఏర్పాటుకు గల కారణాలు, వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏపీలో పలు చోట్ల చర్చాగోష్ఠిలు, సదస్సులు, సమావేశాలను నిర్వహించనుంది. ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 15 వరకు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టబోతోంది.