ఏపీ అధికారపార్టీ వైసీపీ ఎన్నికల ముందు వరకు పార్టీ కార్యాక్రమాలన్ని ముఖ్యమంత్రి నివాసమైన లోటస్ పాండ్ నుంచే కొనసాగించారు. అయితే ఎన్నికల తర్వాతపార్టీ అధికారంలోకి రావడంతో అమరావతికి మారిపోయారు. తాడేపల్లిలో ఆయన నివాసంలోనే ఒక పక్క భవనాన్ని పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకోవాలని భావించినా అలా చేయలేదు. అయితే ప్రస్తుతం ఏపీలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని రెడీ చేస్తున్నారు. ఐదు అంతస్తులతో దీన్ని ముస్తాబు చేస్తున్నట్టుగా తెలుస్తోంది .
ముఖ్యమంత్రి జగన్ నివాసమున్న తాడేపల్లిలోనే ఈ కొత్త కార్యాలయం కూడా ఉంది. వైసీపీ కేంద్ర కార్యాలయంగా ఉపయోగించుకోవాలనుకుంటున్న ఈ భవనం ..ఆపార్టీకి చెందిన ఒక నేతదేనని తెలుస్తోంది. పార్టీ కార్యాలయం కోసం అద్దెకు ఇచ్చేందుకు ఆయన అంగీకరించడంతో త్వరలోనే ఈ భవనంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. సీఎం జగన్ నివాసానికి దగ్గరగానే పార్టీ కార్యాలయం కూడా ఉండటంతో పార్టీ శ్రేణులకు కూడా బాగా కలిసివస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే పార్టీ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.