వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అర్హులైన రైతులందరికీ అందజేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రామపంచాయతీల వారీగా.. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వెబ్‌లాండ్ జాబితాను పరిశీలించి అందులో ఉన్నవారు నిజమైన రైతులో కాదో గుర్తించి ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని జగన్ తెలిపారు. గతంలో మాదిరిగా వ్యవసాయం చేయని వారికి, విదేశాల్లో ఉంటూ సాగు చేయని భూ యజమానులకు, వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్, చేపల చెరువులుగా మార్పిడి చేసిన వారికి రైతు భరోసా వర్తించదని ఆయన చెప్పారు.
వైఎస్సార్ రైతు భరోసా పై పక్కా ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తండ్రి చనిపోయాక వ్యవసాయం చేస్తున్న పిల్లల పేర్లు, కొత్తగా భూమి కొనుగోలు చేసిన వారి పేర్లు, ఈనాం సాగుదార్లను రికార్డుల్లోకి ఎక్కించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత అర్హుల జాబితాను గ్రామ సచివాలయ జాబితాలో చేరుస్తారు. పీఎం కిసాన్ డేటా, అన్నదాత సుఖీభవలో చాలా లోపాలు జరిగాయని, వాటిని సవరించి అర్హులను గుర్తించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు.