హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో నెలకొన్న వివాదం సమసిపోయింది. శిలలపై చెక్కిన రాజకీయ నేతల శిల్పాలను శిల్పులు చెరిపేశారు. ఇటీవల ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అక్కడి రాతి స్థంభాలపై కేసీఆర్, కారు, చార్మినార్, మరి కొంత మంది రాజకీయ నేతల చిత్రాలను చెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అది వివాదం రాజుకుంది. హిందూ ఆలయంలో రాజకీయాలేంటి అంటూ టీఆర్ఎస్ పార్టీపై హిందూ సంఘాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధ్వజమెత్తాయి. అయితే తొలుత కొందరు అధికారులు సమర్థించుకున్నా.. హిందూ సంఘాలతో పాటుగా రాజకీయ పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు రావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాతి స్థంభాలపై చెక్కిన రాజకీయ నేతల చిత్రాలను చెరిపేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ నిర్మాణంలో అష్టభుజి ప్రాకారం రాతి స్తంభాలపై ఏర్పాటు చేసిన వివాదాస్పద చిత్రాలను తొలగించారు.
చిత్రాలను తొలగించిన వాటి స్థానంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలను చెక్కుతున్నారు. సీఎం కేసీఆర్, కారు, ప్రభుత్వ పథకాల చిత్రాలు, నెహ్రూ, గాంధీ, రాజీవ్, చార్మినార్, కమలం పువ్వు చిహ్నాలు తీసివేశామని.. స్థాపతి ఆనంద్ వేలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ తోపాటు ఇతర చిత్రాలను చెక్కడంలో ప్రభుత్వ పాత్ర లేదని.. శిల్పులు వారిపై ఉన్న అభిమానంతోనే చెక్కారని మరోసారి వివరణ ఇచ్చారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. తమ దృష్టికి తీసుకొస్తే.. సరిచేస్తామని తెలిపారు.