కరోనావైరస్ వచ్చి ప్రపంచంలోని జనాభా మొత్తాన్ని ఇంట్లో లాక్ చేసేసింది. ఈ వైరస్ ఎఫెక్ట్ తో ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోగా..కొందరు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన 29 ఏండ్ల చార్లీ లెల్లో కూడా లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమయ్యారు. ఆమె పని చేస్తున్న కంపెనీ సెలవులు తీసుకోమని చెప్పింది. దీంతో ఇంటి వద్ద ఖాళీగా ఉండేబదులు ఏదో ఒక కొత్త ప్రయోగం చేయాలని భావించింది లెల్లో. సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన గుడ్లను పొదిగించి గద్ద పిల్లలు వృద్ధిచేసిన విషయాన్ని ఫేస్‌బుక్ వీడియో ద్వారా తెలుసుకుంది. దీంతో తాను కూడా ఆ ప్రయోగం చేయాలని నిర్ణయించుకుంది.
అనుకున్నదే తడవుగా సూపర్ మార్కెట్‌కు వెళ్లన లెల్లో మూడు బాతు గుడ్లను తెచ్చింది. వాటిని ఇంక్యుబేటర్‌లో ఉంచి రోజూ పరిశీలించసాగింది. అయితే వారం రోజుల వరకు వాటిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో నిరాశ చెందింది. ఆ తర్వాత గుడ్ల లోపల మార్పులు జరుగుతున్నట్లు అనిపించడంతో ఆమెకు జోష్ వచ్చింది. అలా నెల రోజుల గడిచిన తర్వాత ఆ గుడ్ల నుంచి మూడు బుజ్జి బాతు పిల్లలు బయటకు వచ్చాయి. వాటికి బీప్, పీప్, మీప్ అని పేరుపెట్టింది లెల్లో. ఎప్పుడూ ఉద్యోగంతో బిజీగా ఉండే తాను కోవిడ్-19 నేపథ్యంలో ఇంటివద్దే ఉండటంతో ఇలా చేయగలిగినట్లు తెలిపింది. అవి పెద్దగా అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటానని ఆమె తెలిపింది.