టీఆర్‌ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోందా..? ఆ జిల్లాల్లో గులాబీ నేతల మధ్య కుమ్ములాటలు
మొన్న ఖమ్మం.. ఇవాళ వరంగల్ ఇలా వరుసగా గులాబీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లా నేతలపై..
మొన్న ఖమ్మం.. ఇవాళ వరంగల్ ఇలా వరుసగా గులాబీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లా నేతలపై ఆపార్టీ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శలు గుప్పించగా… తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో విభేదాలు భగ్గుమన్నాయి. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతల మధ్య వర్గ విభేదాలు వెలుగు చూస్తుండటంతో టీఆర్‌ఎస్ అధిష్టానం ఆందోళన చెందుతుంది.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు మధ్య వైరం నెలకొంది. మంత్రి సోదరుడు, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. దీంతో ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. స్థానిక నాయకుడి బర్త్‌డే వేడుకల సందర్భంగా ఇద్దరు నేతల అనుచరులు వీధి పోరాటానికి దిగారు. పరస్పరం కొట్టుకున్నారు. ఇందులో ప్రదీప్‌రావు అనుచరుడు ఒకరు గాయపడ్డారు. ఈ కొట్లాకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ టార్గెట్‌గా ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఆరోపణలు చేశారు. తన వర్గంవారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ప్రదీప్‌రావు మండిపడ్డారు. తన వర్గీయులపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చందాలు వసూలు చేసే నేతల చిల్లర రాజకీయాలు సహించేది లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిల్లర నాయకులకు చెంచాగిరి చేయడం పోలీసులు మానుకోవాలని సూచించారు. రెండు రోజుల్లో న్యాయం జరగకపోతే దేనికైనా సిద్ధమని ప్రదీప్‌రావు ప్రకటించడం జిల్లాలో రాజకీయంగా కాక రేపుతుంది.