
మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా తనను ప్రతిపాదించారని వచ్చిన వార్తలను కేంద్ర మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ తొసిపుచ్చారు. మహారాష్ట్రకు తాను తిరిగి వచ్చే ప్రసక్తే లేదని, ఢిల్లీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగుతారని, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు. ఫడ్నవీస్ నేతృత్వంలోనే నూతన ప్రభుత్వం ఏర్పడుతుందని క్లారిటీ ఇచ్చారు. ‘ ఆర్ఎస్ఎస్ కి గానీ, మోహన్ భగవత్ కి గానీ దీంతో సంబంధం లేదు.. శివసేన మద్దతును మేం పొందగలుగుతాం ‘ అని గడ్కరీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి శివసేన ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సేన రెండు వర్గాలుగా చీలిపోయినట్టు, బీజేపీతో రాజీకి రావాలని కొంతమంది సూచిస్తున్నారని, మరికొందరు 50 : 50 ఫార్ములా కోసం పట్టు బడుతున్నారని వస్తున్న వార్తలను సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఖండించారు. తమ ఎమ్మెల్యేలు ‘ జారిపోకుండా ‘ వారిని ఏదైనా రిసార్టుకు తరలించే యోచనలో సేన ఉందన్న ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. ఫిరాయింపుల నుంచి వారిని రక్షించాల్సిన అవసరం తమకు లేదన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ చీలిపోదన్నారు. ‘ మా శాసన సభ్యులు పార్టీకి కట్టుబడి ఉన్నారు. వదంతులు సృష్టించేవారు మొదట తమ ఎమ్మెల్యేల గురించి ఆందోళన చెందాలి ‘ అని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ శివసేన ఎమ్మెల్యేల వద్దకు రావడానికి ఎవరూ సాహసించబోరు ‘ అని తీవ్ర స్వరంతో అన్నారాయన.
అయితే ముంబైలోని బాంద్రా కుంద్రా కాంప్లెక్స్ లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి శివసేన ఎమ్మెల్యేలను తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ హోటల్… సేన చీఫ్ ఉధ్ధవ్ థాక్రే నివాసానికి దగ్గరలోనే ఉంది. ఆయన తీసుకునే నిర్ణయంపైనే ఈ ఎమ్మెల్యేల తరలింపు ఉంటుందని భావిస్తున్నారు.