Assam Polls: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఆర్జేడీనేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. భావ సారూప్యం గల పార్టీలతో మేం పొత్తు పెట్టుకుంటామని ఆయన చెప్పారు. శనివారం గౌహతిని విజిట్ చేసిన ఆయన.. కాంగ్రెస్ పార్టీతో తాము అప్పుడే చర్చలు జరిపామని, ఇలాగే ఆలిండియా యూడీఎఫ్ తో కూడా మంతనాలు జరుపుతామని ఆయన అన్నారు. తమది జాతీయ పార్టీ అని, దీన్ని మరింత విస్తరింపజేస్తామని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రంలో బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలకు చెందిన హిందీ మాట్లాడే ప్రజలు ఉన్నారని, మొత్తం 11 నియోజకవర్గాల్లో ఉన్న వీరి ఓట్లను పొందే ప్రయత్నం చేస్తామన్నారు. అయితే ఇదే సమయంలో తమకు విజయావకాశాలు ఉన్న చోట్లే పోటీ చేసే యోచన కూడా ఉందన్నారు. తాను త్వరలో ఎన్నికలు జరగనున్న బెంగాల్, కేరళ, రాష్ట్రాలతో బాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాన్ని కూడా విజిట్ చేస్తానని చెప్పిన ఆయన.. ఆయా చోట్ల బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని అన్నారు. అస్సాంలో మతతత్వ పార్టీని అధికారంలోకి రానివ్వబోమన్నారు.
భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. రైతుల ప్రయోజనాల పట్ల ఆ పార్టీకి ఆసక్తి లేదన్నారు. వివాదాస్పదమైన చట్టాలను తెఛ్చి వారి జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు. అన్నదాతలు ఈ మోదీ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని ఆయన చెప్పారు. అస్సాం శానసభలోని 126 సీట్లకు మార్ఛి 27-ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 మధ్య మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలు స్వాగతించాయి. సీట్లపంపిణీ, అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించాయి. ఇటీవల ఈ రాష్ట్రాన్ని సందర్శించిన హోమ్ మంత్రి అమిత్ షా ఇక్కడి ప్రాంతీయ పార్టీలను దూయబట్టారు. వాటిని వేర్పాటువాద శక్తులుగా అభివర్ణించారు. అటు ఈ మధ్యే అస్సాం ను విజిట్ చేసిన ప్రధాని మోదీ ఇక్కడ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కొన్నింటిని జాతికి అంకితం చేశారు.