కోవిడ్ 19 ఎలా పుట్టింది ? భవిష్యత్తులో నివారణకై సమగ్ర ప్లాన్ అవసరమన్న టెడ్రోస్, సమిష్టి కృషి కై సూచన

| Edited By: Pardhasaradhi Peri

Dec 01, 2020 | 4:00 PM

ప్రపంచ దేశాలకు చేటుగా పరిణమించిన కోవిడ్ 19 వైరస్ అసలు ఎలా జనించిందన్న దానిపై మరిన్ని పరిశోధనలు జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ అన్నారు. దీనివల్ల భవిష్యత్తులో..

కోవిడ్ 19 ఎలా పుట్టింది ? భవిష్యత్తులో నివారణకై సమగ్ర ప్లాన్ అవసరమన్న టెడ్రోస్, సమిష్టి కృషి కై సూచన
Follow us on

ప్రపంచ దేశాలకు చేటుగా పరిణమించిన కోవిడ్ 19 వైరస్ అసలు ఎలా జనించిందన్న దానిపై మరిన్ని పరిశోధనలు జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ అన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇక ఇది సోకకుండా చూడవచ్చునన్నారు. పలు దేశాల్లో ముందు ముందు పండుగ సీజన్లు, హాలిడేలు (క్రిస్మస్) రానున్నాయని, కుటుంబమంతా ఆనందంగా  వీటిని జరుపుకోవాలంటే మనం ప్రమాదంలో పడకుండా చూసుకోవాలని ఆయన చెప్పారు. పరిస్థితి అదుపులోకి వచ్చింది కదా అని ఊరట చెందడానికి వీల్లేదని, ప్రతివారూ సురక్షితంగా ఉండేంతవరకు ఎవరూ సురక్షితులు కారని ఆయన వ్యాఖ్యానించారు. పేద దేశాలకు తమ సంస్థ తరఫున ఉత్పత్తి అవుతున్న కోవాక్స్ వ్యాక్సిన్ పంపిణీ గురించి ప్రస్తావిస్తూ ఆయన, సెప్టెంబరు నుంచి ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా యూరప్ లో కరోనా వైరస్ తగ్గుదల కనిపించిందని, ఇది సంతోషకరమని పేర్కొన్నారు.

కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నుంచి పుట్టిందన్న స్టడీ ఒకటుంది. అయితే అక్కడ జరిగిన పరిశోధనల ఆధారంగా మరింత రీసెర్చ్ జరిగి అసలు భవిష్యత్తులో మళ్ళీ తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది అని టెడ్రోస్ అన్నారు. ఈ వైరస్ సమస్యను ఎంతమాత్రం రాజకీయం చేయరాదని ఆయన సూచించారు. సైన్స్ ఆధారంగా మనం ముందుకు వెళ్తున్నామని, శాస్త్రీయంగా జరుగుతున్న పరిశోధనలకు ఈ రాజకీయమన్నది అవరోధంగా మారుతుందని ఆయన చెప్పారు. అందువల్లే దయచేసి దీన్ని పొలిటిసైజ్ చేయకండి అభ్యర్థించారు. 2019 లో కరోనా వైరస్ ఇండియాలో పుట్టిందని చైనా శాస్త్రజ్ఞులు చేసిన స్టేట్ మెంట్ ను టెడ్రోస్ పరోక్షంగా ప్రస్తావించారు.

కోవిడ్ ను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని  వివిధ కంపెనీలు,  ఫార్మా సంస్థలు వేర్వేరు  వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయని, అయితే ఇదే సమయంలో ఈ వైరస్ పుట్టుకపై కూడా పరిశోధనలు జరిగితే అంతకంటే మంచి ఏముంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రీసెర్చర్లు సమిష్టిగా కృషి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వైరస్ వ్యాప్తి నివారణకు స్థానిక లేదా జాతీయ మార్గదర్శక సూత్రాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.  సేఫ్టీ ప్రొటొకాల్స్ ని నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. లాక్ డౌన్ వంటి చర్యలు చాలావరకు దీన్ని అదుపు చేయడంలో తోడ్పడ్డాయని టెడ్రోస్ వ్యాఖ్యానించారు.