వారం రోజులుగా హైదరాబాద్ (Hyderabad) లో వర్షాలు దంచికొడుతున్నాయి. విరామం ఇవ్వని వరుణుడు ముసురు పట్టి రోజంతా కురుస్తూనే ఉన్నాడు. నగరంలోని జలాశయాలు, కుంటలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో ఆయా జలాశయాల నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేసే తాగునీటి పై జలమండలి ఎండీ దాన కిశోర్ (MD.Dana Kishore) పలు సూచనలు చేశారు. ఈ మేరకు బేగంపేటలో పర్యటించారు. బేగంపేటలోని (Begumpet) పాటిగడ్డ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని పరిశీలించారు. తాగునీటి సరఫరా గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సరఫరా అయిన తాగునీటిలో క్లోరిన్ లెవల్స్ ను స్వయంగా పరీక్షించారు. వర్షాలు కురుస్తున్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలుషిత నీటి సరఫరాకు అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు క్లోరిన్ బిళ్లలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే నగరంలో 5 లక్షల క్లోరిన్ బిళ్లలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రతిరోజు నగరవ్యాప్తంగా 15 వేల క్లోరిన్ టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు.. హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు రాబోయే 4-5 రోజులలో మిగిలిన ప్రాంతాలను ముంచెత్తుతాయని తెలిపారు. దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం నేడు ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళఖాతంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం మరింత బలపడనున్నదని వాతావరణ శాఖా అంచనా వేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి