35 రోజుల తర్వాత ఆర్టీసీ సమ్మె అత్యంత కీలక, సున్నితమైన దశకు చేరుకుంది. తెగేదాకా లాగేందుకే అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాల వెనుకున్న రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నట్లు క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. చర్చల ద్వారా సమ్మెను పరిష్కరించాలని హైకోర్టు పదే పదే చేసిన విఙ్ఞప్తిని కొంతమేరకు ప్రభుత్వం పట్టించుకుని, చర్యలకు సిద్దపడినా.. కార్మిక సంఘాల వెనుక వున్న రాజకీయ పార్టీలు పట్టువిడుపులకు సిద్దపడనివ్వడం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం జరగనున్న చలో ట్యాంక్‌బండ్ లేదా సకల జనుల సామూహిక దీక్ష లేదా మిలియన్ మార్చ్ కార్యక్రమంతో సమ్మె కొత్త దిశకు మళ్ళనున్నట్లు కనిపిస్తోంది.
35 రోజుల నుంచి సాగుతున్న ఆర్టీసీ సమ్మె.. పరిష్కారం దిశగా కాకుండా సంక్షోభం దిశగా సాగుతోంది. చర్చలు జరపాలని హైకోర్టు చెబుతున్నా ఆ వాతావరణం మాత్రం కనిపించడం లేదు. పోలీసుల అనుమతి లేని రేపటి సకల జనుల సామూహిక దీక్ష కార్యక్రమం ఇప్పటికే అరెస్టులతో పరిస్థితిని దిగజారుస్తోంది.
ఈ పరిస్థితుల్లో అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు, మధ్యలో విపక్షాలు ఏం చేయాల్సిన అవసరం ఉంది. విపక్షాలు సమస్యను జటిలం చేస్తాయా, పరిష్కారానికి సహకరిస్తాయా అన్నది ఒక అంశం. అలాగే ఆర్టీసీ చట్టబద్ధత, రూట్ల ప్రైవేటీకరణ, ఆస్తులు-అప్పులు మరో సంక్లిష్టమైన అంశం. ఆర్టీసీ సమస్య పరిష్కారానికి దారేది అంటే సమాధానం కనిపించడం లేదు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 35 రోజులుగా చేస్తున్న సమ్మె మరో మలుపు తిరిగింది. ఛలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి రాకపోవంతో, సకలజనల సామూహిక దీక్ష అని పేరుపెట్టినా, పోలీసులు ఎవరినీ వదలడం లేదు. ముందుగా ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని విద్యానగర్‌లో అరెస్టు చేశారు. శనివారం నాటి కార్యక్రమానికి కార్మికులు రాకుండా జిల్లాల్లో ఎక్కడికక్కడ అరెస్టులు సాగుతున్నాయి.
మరోవైపు ముఖ్యనేతల కోసం పోలీసులు ముమ్మరం చేశారు. దీంతో జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డితోపాటు పలువురు ఇప్పటికే అజ్ఞానంలోకి వెళ్లారు.మరోవైపు 5100 రూట్ల ప్రైవేటీకరణ అంశంపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు సూచన ప్రకారం, అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఒక మెట్టుదిగాలని విపక్ష నేతలు సూచిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి ఆర్టీసీ సమ్మెపై గవర్నర్‌కి వివరించారు. సకల జనుల సామూహిక దీక్షకు విపక్షం మొత్తం మద్దతు తెలిపింది.
అటు ప్రభుత్వం మాత్రం- ఈ పరిణామాలపై సమీక్ష నిర్వహిస్తోంది. ఆర్టీసీ అంశంపై 14వ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించడం విశేషం. రూట్ల ప్రైవేటీకరణ అంశంపై ఏయే అంశాలు వివరించాలి అన్న అంశంతోపాటు, చర్చల విషయంలో హైకోర్టు సూచన, ఆర్టీసీ ఆర్థికస్థితి తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షల్లో తలమునకలైంది. ఆర్టీసీ ప్రావిడెంట్ ఫండ్ నిధులు 760.62 కోట్ల రూపాయలను చెల్లించాలంటూ EPFO ఆర్టీసీ యాజమాన్యానికి నోటీస్ పంపింది. మొత్తమ్మీద ఒకవైపు సకల జనుల సామూహిక దీక్ష వాతావరణం, మరోవైపు హైకోర్టులో దాఖలైన కేసుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది.