విశాఖపట్నంలోని మురళీనగర్‌లో ఉన్న ప్రముఖ దేవస్థానం శ్రీ వైభవ వే౦కటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆలయంలో పనిచేస్తున్న పూజారుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని ఆయన తెలిపారు. విశాఖ ఎంపి ఎంవివి సత్యన్నారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి మురళీనగర్ లో ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని విజయసారెడ్డి దర్శించుకున్నారు. విజయసాయిరెడ్డికి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆలయం ఆరంభం నుంచి ఉన్న సంప్రదాయ౦ విషయంలో దేవాదాయ శాఖ జోక్యం చేసుకోదని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. కమిటీ సభ్యుల్లో అభిప్రాయ భేదాలు వస్తే ఆగమ కమిటీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తుందని అన్నారు. ఇప్పటివరకు ఆలయ అభివృద్ధికి పనిచేసిన కమిటీ సభ్యులుగా ఉన్న పలువురుని ట్రస్టు బోర్డు మెంబర్స్ గా తీసుకోవటం కోసం సీఎంకి విన్నవిస్తానని విజయసాయి తెలిపారు. ‘దేవాదాయ శాఖ పరిధిలోకి వెళితే ఆలయ అస్తులను, ఆదాయాన్ని డైవర్ట్ చేస్తారని అపోహ ఉంది… అయితే దీనిలో వాస్తవం లేదు.. ఏ డొనేషన్స్ వచ్చినా అవి ఆ టెంపుల్ కే చెందుతాయి’ అని విజయారెడ్డి స్పష్టం చేశారు.