దివాళా దిశగా.. వర్జిన్ ఆస్ట్రేలియా..

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఆస్ట్రేలియాకు చెందిన రెండో అతిపెద్ద విమానయాన సంస్థ వర్జిన్‌ ఆస్ట్రేలియా, కరోనా నష్టాల సుడిగాలుల్లో చిక్కుకుని విలవిల

దివాళా దిశగా.. వర్జిన్ ఆస్ట్రేలియా..

Edited By:

Updated on: Apr 22, 2020 | 5:06 PM

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఆస్ట్రేలియాకు చెందిన రెండో అతిపెద్ద విమానయాన సంస్థ వర్జిన్‌ ఆస్ట్రేలియా, కరోనా నష్టాల సుడిగాలుల్లో చిక్కుకుని విలవిల లాడుతోంది. ఫలితంగా 16,000 మంది ఉద్యోగుల భవిత ప్రమాదంలో పడింది. మరింత మూలధనం కోసం వాలంటరీ అడ్మినిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆశ్రయించామని సంస్థ తెలిపింది. కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి, తదనంతరం పలు దేశాలు లాక్‌డౌన్‌ విధించడం, దేశీయ-అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించడంతో, ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి విదితమే.

కరోనా కట్టడి నేపథ్యంలో.. అన్ని విమాన సర్వీసులు రద్దవడంతో వర్జిన్‌ ఆస్ట్రేలియా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఫెడరల్‌ ప్రభుత్వం నుంచి సుమారు రూ. 6800 కోట్ల (887.60 మిలియన్‌ డాలర్ల) రుణం పొందడంలో విఫలం కావడం పరిస్థితిని మరింత దుర్భరం చేసింది. అనుబంధ సంస్థ టైగర్‌ఎయిర్‌ కూడా తమ సర్వీసులన్నీ నిలిపేసింది.

కాగా.. చరిత్రలోనే ఎన్నడూ లేని దుర్భర స్థితి కరోనా వల్ల విమానయాన సంస్థలకు ఏర్పడింది. మాకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే స్థితి. మా గ్రూప్‌నకు గత 24 గంటల్లో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే మా బోర్డు సాహసోపేతంగా నిర్ణయం తీసుకుని, వాలంటరీ అడ్మినిస్ట్రేషన్‌ డెలాయిట్‌ను ఆశ్రయించింది. సంక్షోభ పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాం. ప్రస్తుతం కంటే తక్కువ స్థాయిలోనే, మరింత బలంగా కార్యకలాపాలు తిరిగి చేపట్టి, ఆస్ట్రేలియా ఆర్థికస్థితికి పాటుపడతామనే భావిస్తున్నాం.

కాగా.. వర్జిన్‌ ఆస్ట్రేలియా సంస్థలో ప్రత్యక్షంగా 10,000 మంది ఉద్యోగులుండగా, మరో 6,000 మందికి పరోక్షంగా సంస్థ అవకాశం కల్పిస్తోంది. మే ఆఖరు వరకు వేతనం లేని సెలవు ఇస్తున్నట్లు గత నెలలోనే సంస్థ 8,000 మందికి వెల్లడించింది కూడా. అంతర్జాతీయ సర్వీసులన్నీ నిలిచిపోగా, సిడ్నీ-మెల్‌బోర్న్‌ మధ్య మాత్రమే సంస్థ ఒక విమానం నిర్వహిస్తోంది.

Follow Us