Uttar Pradesh Assembly Elections 2022: యూపీలో ఎన్నికల జరుగనున్న క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషలిజం మార్గమే వాస్తవానికి రామరాజ్య మార్గమని అన్నారు. శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి తన కలల్లోకి వస్తాడని, సమాజ్‌వాదీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. “శ్రీ కృష్ణ భగవానుడు నా కలలోకి వచ్చి సమాజ్ వాదీ ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పాడు” అని యాదవ్ ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. నిన్న వచ్చాడు, ప్రతిరోజూ వస్తాడంటూ వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎమ్మెల్యే మాధురి వర్మ సమాజ్ వాదీ పార్టీలో చేరుతుకున్న సందర్భంగా ఎస్పీ నిర్వహించిన సభలో అఖిలేష్ యాదవ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీలో జరిగే ఎన్నికల్లో సమాజ్ వాద్ పార్టీయే విజయం సాధిస్తుందని.. వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఆ విషయాన్ని నాకు శ్రీకృష్ణుడు చెప్పాడని ధీమా వ్యక్తంచేశారు బీజేపీ తరచుగా రామరాజ్యం గురించి మాట్లాడుతుందని, అయితే వాస్తవానికి సోషలిజం మార్గమే రామరాజ్యమని అన్నారు. సోషలిజం మార్గమే రామరాజ్యం అని ఆయన స్పష్టం చేశారు. సోషలిజం సంపూర్ణంగా అమలులోకి వచ్చిన రోజు నుంచి రామరాజ్యం ప్రారంభమవుతుందన్నారు. ఆదివారం లక్నోలో కొత్తగా నిర్మించిన పరశురాముని ఆలయంలో దర్శనం ఇచ్చిన తర్వాత అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ విజయ యాత్రను ప్రారంభించారు.
#WATCH | “Lord Sri Krishna comes to my dream every night to tell me that our party is going to form the government,” said Former UP CM and Samajwadi Party chief Akhilesh Yadav yesterday pic.twitter.com/rmq1p8XgwT
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 4, 2022
యూపీలో అధికారంలోకి వచ్చిననాటినుంచి సీఎం యోగి ప్రభుత్వం అన్నింటిలోను విఫలమైందని అఖిలేశ్ విమర్శించారు. సమాజ్ వాదీ పార్టీలో రౌడీలు ఉన్నారని బీజేపీ చేసిన ఆరోపణలపై అఖిలేష్ స్పందిస్తు.. నేరాలు చేసిన క్రిమినల్స్‌ను పార్టీలో పదవులు ఇచ్చిన ఘనత బీజేపీదేనని ధ్వజమెత్తారు. బీజేపీ కోసం ఎంతో కృషిచేసానని చెప్పుకునే యోగి.. ఎక్కడినుంచి వచ్చారో ఓసారి గుర్తు తెచ్చుకోవాలని అఖిలేశ్ సూచించారు. బీజేపీ ప్రభుత్వానికి పేర్లు మార్చటమే పనిగా మారిందని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. సమాజ్‌వాదీ అధికారంలోకి వస్తే ఇళ్లకు నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు అఖిలేష్ యాదవ్.
ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్ నుంచి బీఎస్పీ మాజీ ఎంపీ రాకేష్ పాండే, బహ్రైచ్ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాధురీ వర్మ, శాసనమండలి మాజీ సభ్యుడు కాంతి సింగ్, ప్రతాప్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే బ్రిజేష్ మిశ్రా, విశాల్ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు బీర్బల్ సింగ్ కశ్యప్ తమ మద్దతుదారులతో కలిసి ఎస్పీలో చేరారు. ఇదిలావుంటే, బీఎస్పీని వీడి ఎస్పీలో చేరిన మాజీ ఎంపీ రాకేష్ పాండే అంబేద్కర్ నగర్, అయోధ్య జిల్లాలో ప్రభావం చూపుతున్నట్లు భావిస్తున్నారు. రాకేష్ పాండే కుమారుడు రితేష్ పాండే అంబేద్కర్‌నగర్ నుండి బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ మరియు లోక్‌సభలో BSP పార్టీ నాయకుడు కూడా. ఈ నాయకులందరినీ పార్టీలోకి స్వాగతించిన ఎస్పీ అధ్యక్షుడు, రాబోయే కాలంలో ఉత్తరప్రదేశ్‌లో మార్పు వస్తుందని, ఎస్పీ ప్రభుత్వం ఏర్పడుతుందని తాను విశ్వసిస్తున్నానన్నారు.
Read Also… China Landslides: చైనాలో విరిగిపడ్డ కొండచరియలు.. 14 మంది మృత్యువాత, మరో ముగ్గురు సీరియస్!