మ్యుటెంట్ కరోనా వైరస్ ముప్పుతో బ్రిటన్ నుంచి బయటపడేందుకు వేలాది ప్రజలు తహతహలాడుతున్నారు. లండన్ లోని హీత్రో విమానాశ్రయం వేలమంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. డబ్లిన్, ఐర్లాండ్ కు వెళ్ళీ చివరి విమానం ఎక్కేందుకు వీరంతా పోటీలు పడుతున్నారు. యూకే నుంచి వచ్ఛే అన్ని విమానాలను ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, ఎల్ సాల్వడార్, బల్గెరియా, ఆస్ట్రియా,ఐర్లాండ్ వంటి దేశాలు బ్యాన్ చేశాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కొత్త మహమ్మారిపై చర్చించనున్నారు. బ్రిటన్-ఫ్రాన్స్ బోర్డర్ ను ఈ రాత్రికి మూసివేయనున్నారు. బ్రిటన్ నుంచి వచ్ఛే అన్ని లారీలు, ట్రక్కులను ఫ్రాన్స్ నిషేధించింది. లండన్లో మెట్రో రైళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. క్రిస్మస్ సెలవులకు తమ సొంత నగరాలకు వెళ్లే వీలు లేక బ్రిటిషర్లు ఉసూరుమంటున్నారు. తాజాగా విధించిన లాక్ డౌన్ వారిని ఇళ్ల నుంచి కదలకుండా చేస్తోంది.
కాగా.. అమెరికా మాత్రం ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. బ్రిటన్ విమానాలపై బ్యాన్ విధించే విషయాన్ని తాము యోచించడం లేదని అమెరికన్ అధికారులు తెలిపారు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని వారు పేర్కొన్నారు. అటు ఇటలీ వంటి యూరప్ దేశాల్లోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. బ్రిటన్ వైరస్ తమ దేశానికి అంటుకుంటుందని వారు బెంబేలెత్తుతున్నారు.