జమ్ముకశ్మీర్ షోపియన్ జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పక్కా సమాచారం మేరకు షాపియాన్ జిల్లాలోని చకురా ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలను గమనించిన టెర్రరిస్టులు తప్పించుకునేందుకు యత్నించారు. ఇదే క్రమంలో భద్రత సిబ్బందిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి.
కాల్పులు ముగిసిన తర్వాత అక్కడ వెతగ్గా.. ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభించినట్లు భద్రతా దళాల ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, పారిపోయిన మరికొందరు ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో మరింత గాలింపు చర్యలు చేపట్టినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా దళాల సంయుక్త బృందం పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన వారి మృతదేహాలను ఇంకా ఎవరూ స్వాధీనం చేసుకోలేదు. ఇక, మరణించిన ఉగ్రవాదులను ఎవరనేదీ గుర్తించాల్సి ఉంది.