దుబ్బాక విజయంలో ఆ వర్గాలే కీలకం

|

Oct 11, 2020 | 1:13 PM

మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అన్ని వనరులను ఒడ్డి మరీ గెలుపు కోసం శ్రమిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికలో ఎవరు విజయం సాధించాలన్న రెండు వర్గాల...

దుబ్బాక విజయంలో ఆ వర్గాలే కీలకం
Follow us on

Two sections crucial in Dubbaka victory: మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అన్ని వనరులను ఒడ్డి మరీ గెలుపు కోసం శ్రమిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికలో ఎవరు విజయం సాధించాలన్న రెండు వర్గాల మద్దతు అనివార్యంగా కనిపిస్తోంది. ఆ రెండు వర్గాలు ఎటు మొగ్గు చూపితే ఆ అభ్యర్థి ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆ రెండు వర్గాలను మచ్చిక చేసుకునేందుకు శ్రమిస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలో లక్షా 90 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరిలో సుమారు 90 వేల మంది బీసీలు కాగా.. మిగిలిన వారు ఓసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారున్నారు. అయితే, ఈ ప్రాంతంలో చేనేతలు ఎక్కువ సంఖ్యలో వున్నారు. 20 వేలకు పైగా చేనేత ఆధారిత వ్యక్తులు, వారి కుటుంబీకులు ఓటర్లుగా వున్నారు. చాలా కుటుంబాల్లో మహిళలు బీడీ కార్మికులుగా వున్నారు. వీరి సంఖ్య 19,500 గా చెబుతున్నారు. అంటే చేనేత, బీడీ కార్మికులు కలిపి మొత్తం 40 వేల ఓటర్లన్నమాట. ఈ ఓట్లు చాలు.. గెలుపోటములను ప్రభావితం చేసేందుకు.

ప్రభుత్వం నుంచి వివిధ రకాల పెన్షన్లు నగదు రూపేణా పొందుతున్న వారి సంఖ్య సుమారు 57 వేల మంది. వీరంతా తమవైపే ఉన్నారని గులాబీ దళం భావిస్తోంది. నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి ఏదో ఒక రూపకంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనం పొందుతున్న వారున్నారని పింక్ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. దాదాపు 40 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతీ ఏటా సంక్షేమ పథకాలకు కేటాయిస్తోందని, తద్వారా బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అండగా వుందని గులాబీ పార్టీ ప్రచార సారథి, ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెబుతున్నారు.

అయితే, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రచారం ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ నేతల మోసపు మాటలను ఓటర్లు నమ్మే పరిస్థితి ఇపుడు లేదని, అధికార పార్టీ అభ్యర్థిపై తమ విజయం ఖాయమంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎవరి అంఛనాల్లో వారున్నారు.

Also read: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఆలయాల విధ్వంసం