క్యాన్సర్ వ్యాధి..ఇదో భయంకరమైన మహమ్మారి..ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న భూతం. క్యాన్సర్ శరీరంలోని అన్ని భాగాలకు వస్తుంది. చర్మం నుంచి కాలేయం వరకు ప్రతి అవయవానికి అటాక్ అవుతోంది క్యాన్సర్. ఇంత ప్రాణాంతకమైన క్యాన్సర్‌ని ముందుగానే రాకుండా నివారించాలి.. క్యాన్సర్ ఒక్కసారి అటాక్ అయిందంటే..ఇక పరిస్థితి నరకప్రాయమే. ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి కాబట్టి..ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్ భారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. క్యాన్సర్ సోకిన బాధితులకు వైద్య ఖర్చులు తలకు మించిన భారం అవుతుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించాల్సి ఉంటుంది. అందుకు లక్షలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. అయినా కూడా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు భరోసా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లాలో మహిళలకు క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు చేయగా ఆందోళన కలిగించే విషయాలు వెలుగు చూశాయి.
ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా తెలంగాణ జిల్లాలో ఈ క్యాన్సర్ స్ర్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. పింక్ అనే అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన డాక్టర్‌ల బృందం ఒక్క రామాయంపేట్‌లో మహిళలకు పరీక్షలు చేయగా, 215 మందిలో 22 మంది అనుమానితులను గుర్తించారు. బాధితులను ఎమ్‌ఎన్‌జే ఆస్పత్రికి తరలించి క్యాన్సర్ పరీక్షలు చేసి చికిత్స అందిస్తామని DMHO డా.వెంకటేశ్వర్ రావు తెలిపారు. దాదాపు 10 శాతం మహిళలు క్యాన్సర్ అనుమానితులుగా స్ర్రీనింగ్ టెస్టులో తేలటం ఆందోళన కలిగించే అంశం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,30,000 మంది మహిళలకు పరీక్షలు చేయగా 937 మంది అనుమానితులుగా గుర్తించామని చెప్పారు.
మారు మూలప్రాంతాల మహిళలకు క్యాన్సర్‌పై పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. మహిళలు తప్పనిసరిగ క్యాన్సర్‌పై ఎటువంటి అనుమానాలు ఉన్న అడిగి తెలుసుకోవాలని సూచించారు. అందుకోసం ప్రతి PHCలోనూ NCD స్టాఫ్ నర్స్, ఒక కౌన్సిలర్ అందుబాటులో ఉన్నారని తెలిపారు. సంబంధిత పరీక్షలు చేయించుకుని ఆరోగ్యం పట్ల జాగృతం కావాలని కోరారు.
ప్రస్తుతం క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్న వారికి ఈ పరీక్షల వల్ల ఎంతో మేలు చేకూరనున్నట్లు వైద్యులు వెల్లడించారు. జిల్లాలో మహిళల్లో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ సమస్యలు ఎక్కువగా ఉండగా, పురుషుల్లో లంగ్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ ఎక్కువగా వస్తోంది. రొమ్ము, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్..ఇలా అనేక క్యాన్సర్లు ప్రాణాలను హరిస్తున్నాయి. క్యాన్సర్ సోకినట్లు ముందే గుర్తిస్తే ప్రారంభ దశలోనే వారికి వూద్యం అందించి నయం చేసేందుకు అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో మంది అభాగ్యులకు మేలు చేకూరనుంది.