కేరళలో కరోనా కేసుల సంఖ్య 12 కి పెరిగింది. దీంతో దేశంలో మొత్తం 56 కేసులు నమోదయ్యాయి. కేరళలో ఈ వ్యాధి వ్యాప్తి నివారణకు గాను సినిమా హాస్టళ్లను ఈ నెల 31 వరకు మూసివేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్టు తెలిసిందని సీఎం పినరయి విజయన్ తెలిపారు. కరోనా నివారణకు ఈ నెల 31 వరకు ఏడో తరగతి లోపు క్లాసులు నిర్వహిస్తున్న స్కూళ్లన్నీ మూసివేస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే అన్ని వెకేషన్, ట్యూషన్ తరగతులు, అంగన్ వాడీలు, మదరసాలు 31 వరకు మూసి ఉంటాయని పేర్కొన్నారు.
కాగా.. కరోనా వైరస్ రోగులతో సన్నిహితంగా ఉన్నట్టు 270 మందిని కనుగొన్న అధికారులు.. వీరిలో 95 మందిని ‘హైరిస్క్ కేటగిరీ’ లో చేర్చారు. 1116 మందిపై వైద్య సంబంధ నిఘా ఉంచామని, 149 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ తెలిపారు. అటు- కరోనా వ్యాప్తి నివారణకు మణిపూర్ ప్రభుత్వం మయన్మార్ తో గల తన అన్ని బోర్డర్ పాయింట్లనూ మూసివేసింది. కర్ణాటకలో కరోనా కేసులు నాలుగు నమోదయ్యాయి.