కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు, పలు చోట్ల కోవిడ్ నిబంధనలు పాటించని భక్తులు

|

Nov 22, 2020 | 9:30 AM

తుంగభద్ర పుష్కరశోభతో సందడిగా మారింది. నదీతీరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు, పలు చోట్ల కోవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
Follow us on

తుంగభద్ర పుష్కరశోభతో సందడిగా మారింది. నదీతీరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే పుష్కరాల సమయంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకడ్డ వేసేందుకు అధికారులు కోవిడ్‌ నిబంధనలు విధించారు. అయినా కానీ చాలా మందిలో వైరస్‌ భయమనేదే కనిపించడం లేదు. చాలా మంది మాస్కులు లేకుండా వస్తుండటం, భౌతికదూరం పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కలిసికట్టుగా తిరగడం, స్నానాలను ఆచరిస్తుండడంతో అధికారులు.. మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. అసలే కార్తీకమాసం కావడంతో.. రోజురోజుకు భక్తుల సంఖ్య మరింత పెరుగుతూ పోతోంది. తుంగభద్రతీరంలో వెలిసిన ప్రసిద్ధపుణ్యక్షేత్రం మంత్రాలయానికి తరలివస్తున్న భక్తులు.. పుణ్యస్నానాలు ఆచరించి రాఘవేంద్రస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమ, శుక్రవారాలతో పాటు వీకెండ్స్‌లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు… అందరికీ స్క్రీనింగ్‌ టెస్టును మస్ట్‌ చేశారు. నగరేశ్వర స్వామి ఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డుకు కరోనా సోకడం అలజడి రేపినా…. సహచరులకు నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

పుష్కరస్నానాలకు వచ్చే ప్రతీ భక్తుడికి కోవిడ్‌ టెస్టు తప్పనిసరి చేయాలని కర్నూలు కలెక్టర్‌ వీరపాండ్యన్‌ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఆన్‌లైన్‌లో కాకుండా..ఆఫ్‌లైన్‌లో కూడా ఈ టికెట్లు ఇవ్వాలని సూచించారు. కార్తీకమాసం కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశమున్నందున.. అసౌకర్యాలు కల్గకుండా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, కర్నూలు, ఎమ్మిగనూరు, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో మొత్తం కలిపి 23 పుష్కరఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు.