దేశంలోని పలు నగరాల్లో నైట్ కర్ఫ్యూలు, సెక్షన్ 144 అమలు.. కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్లేనా.?
గత కొద్దిరోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా కొత్త లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ అమలులోకి వచ్చాయి.
New Restrictions Imposed in Cities: గత కొద్దిరోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా కొత్త లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ అమలులోకి వచ్చాయి. ఆయా ప్రదేశాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు, సెక్షన్ 144ను మళ్లీ అమలు చేస్తున్నాయి. అన్‌లాక్ ప్రక్రియ మొదలైన ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఏయే రాష్ట్రాల్లో కొత్త కోవిడ్ నిబంధనలు అమలవుతున్నాయో ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతీ రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఢిల్లీ సర్కార్ కఠిన చర్యలు అమలు చేస్తోంది. మాస్క్ ధరించకుండా బయటకొచ్చినా, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వాడినా, భౌతిక దూరాన్ని పాటించకపోయినా రూ. 2 వేలు భారీ జరిమానాను విధించనున్నట్లు వెల్లడించింది. అలాగే ఢిల్లీలో పెళ్లిళ్లకు కేవలం 50 మంది మాత్రమే హాజరు కావాలని తెలిపింది. అటు మార్కెట్లపై ఎల్లప్పుడూ నిఘా ఉంచుతామంది. రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్ ఉండదని.. ప్రజలకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అహ్మదాబాద్: శుక్రవారం(20వ తేదీ) ఉదయం 9 గంటల నుంచి సోమవారం(23వ తేదీ) సాయంత్రం 6 గంటల వరకు అహ్మదాబాద్ నగరంలో అక్కడి ప్రభుత్వం కంప్లీట్ కర్ఫ్యూ విధించింది. ఈ సమయంలో నిత్యావసరాలు, మందుల షాపులకు మాత్రమే అనుమతించింది. అలాగే ప్రతీ రోజూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించనుంది. ఇక రేపటి నుంచి స్కూల్స్ రీ-ఓపెన్ కావాల్సి ఉండగా.. ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసింది.
ఇండోర్: నవంబర్ 21 నుంచి ఇండోర్‌లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలవుతుందని.. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలో పూర్తిగా లాక్‌డౌన్ విధించబోమని.. ఇండోర్‌తో పాటు భోపాల్, గ్వాలియర్, విదిషా, రత్లాం నగరాల్లో కూడా నైట్ కర్ఫ్యూ ఉంటుందని పేర్కొన్నారు.
హర్యానా: స్కూల్స్ తెరిచిన తర్వాత సుమారు 174 మంది విద్యార్ధులకు, 107 టీచర్లకు కరోనా పాజిటివ్ తేలడంతో.. అక్కడి ప్రభుత్వం ఈ నెలాఖరు దాకా స్కూల్స్ మూసివేసింది. అప్పటికీ పరిస్థితులు సరిలేకపోతే.. ఆ డేట్‌ను పొడిగించే అవకాశం లేకపోలేదు.
గుజరాత్: శనివారం(21/11) నుంచి రాజ్‌కోట్, సూరత్, వడోదరా నగరాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేసింది గుజరాత్ సర్కార్.
రాజస్తాన్: రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ శనివారం(21/11) నుంచి సెక్షన్ 144ను రాజస్తాన్ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.
మహారాష్ట్ర: కరోనా వ్యాప్తి కారణంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పరిధిలోని అన్ని పాఠశాలలను ఈ సంవత్సరం పూర్తిగా మూసి వేస్తున్నట్లు మహా సర్కార్ ప్రకటించింది. అలాగే థానేలోని స్కూల్స్ కూడా ఇప్పట్లో తెరుచుకోవని స్పష్టం చేసింది.
Also Read:
మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…
రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..
ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!
వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!