దాదాపు నెలన్నర నుంచి సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మిక సంఘాలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలపైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అంతేకాదు.. మోటర్ వెహికిల్ యాక్ట్102 ప్రకారం ప్రభుత్వానికి విశేష అధికారులు ఉన్నాయని తెలిపింది. ఇటీవల 5100 బస్సులను ప్రైవేట్ రూట్లకు అప్పగిస్తూ టీ-కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమంది.
దీంతో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తీర్పు తర్వాతే ఆర్టీసీ భవితవ్యం గురించి ఆలోచిస్తామంటూ సీఎం కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఆహ్వానిస్తే.. సమ్మె విరమించి విధుల్లోకి హాజరవుతామని ఆర్టీసీ జేఏసీ తెలపింది. అయితే హైకోర్టు ఆర్టీసీ ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా, గురువారం రాత్రి సీఎం కేసీఆర్.. ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన అనంతరం.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీని నడపడం ప్రభుత్వానికి కుదరదన్నట్లు సిగ్నల్స్ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో సీఎం తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది.