తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.. బిజెపి కార్యాలయం నుంచి బైక్ ర్యాలీతో బయల్దేరిన ఆయన చార్మినార్ కు చేరుకున్నారు. చార్మినార్ వద్దకు బండి సంజయ్ చేరుకోగానే అక్కడ ‘జై శ్రీరాం’ అనే నినాదాలు మిన్నంటాయి. సంజయ్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దారి పొడవునా ఆయన ప్రయాణాన్ని వీడియోలు తీశారు. చార్మినార్ వద్ద కూడా అన్ని మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ రోజు శుక్రవారం కావడంతో పాతబస్తీలో పరిస్థితి ఏ క్షణంలోనైనా ఉద్రిక్తంగా మారే పరిస్థితి ఉంటుందని భావించిన పోలీసులు..కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. నగరంలో వరద సాయాన్ని ఆపేయాలంటూ బండి సంజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారంటూ టీఆర్ఎస్ ఆరోపించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు సంజయ్ సవాల్ విసిరారు. తాను లేఖ రాయలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు. సవాల్ విసిరినట్టే బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.