మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను బలితీసుకున్న ఈత సరదా.. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముళ్ల దుర్మరణం..
మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది.
మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. స్నానం చేస్తూ.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరన్నదమ్ముళ్లు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన వెల్దుర్తి మండలం మాసాయిపేటలో వెలుగుచూసింది. మాసాయిపేటకు చెందిన శాహేదా, సమియోద్దీన్ దంపతుల కుమారులు మహమ్మద్ రియాన్(14), మహమ్మద్ ఆర్మాన్ (11). స్థానిక హైస్కూల్ అవరణలో ఆడుకుంటామని ఇంటి నుంచి ఇద్దరు అన్నదమ్ములు బయటకు వచ్చారు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు రాత్రంతా గ్రామంలో వెతికారు. అయిన వారి జాడ కనిపించలేదు.
కాగా, గురువారం మధ్యాహ్నం గ్రామ శివారులోని హల్దీవాగు చెక్ డ్యాం వద్ద చిన్నారుల మృతదేహాలు స్థానికులు గుర్తించారు. దీంతో ఆ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కళ్లముందు కదలాడిన పిల్లలిద్దరూ విగతజీవులుగా పడివుండటంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇద్దరు పిల్లలు ఈత కొట్టేందుకు వచ్చి ప్రమాదవశాత్తు చెక్ డ్యాంలో చనిపోయి ఉంటారని పోలీసలు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.