
తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న వైద్య కళాశాలల్లో 50 శాతం ఓబీసీ రిజర్వేషన్ కు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. (ఈ విద్యా సంవత్సరం నుంచే దీని అమలుకు పర్మిషన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం కోరింది). అయితే తమిళనాడులోని పాలక ఏఐడీఎంకెతో బాటు విపక్ష డీఎంకే కూడా వేసిన పిటిషన్లను జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు నేతృత్వాన గల బెంచ్ తిరస్కరించింది. ఈ ఏడాది 50 శాతం ఓబీసీ రిజర్వేషన్ ను పొడిగించడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొనడంతో దీన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం, డీఎంకే సుప్రీంకోర్టుకెక్కాయి. మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి తమిళనాడు సరెండర్ చేసిన ఆలిండియా సీట్లలో ఓబీసీ కోటాను నిర్ధారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు గత జులై 27 న కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉండాలని సూచించింది. అయితే ఈ కమిటీ తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్ విద్యా సంవత్సరాలకు మాత్రమే వర్తించేలా ఉండాలి తప్ప..ప్రస్తుత విద్యా సంవత్సరానికి కాదని స్పష్టం చేసింది. కాగా- లక్షలాది విద్యార్థులు ‘నీట్’ కోసం గత జనవరి-ఫిబ్రవరిలోనే దరఖాస్తులు దాఖలు చేశారు గనుక మెడికల్ కళాశాలల్లో ఓబీసీ కోటాను పొడిగించడం సాధ్యం కాదని కేంద్రం… అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.