
ఇన్ కమ్ ట్యాక్స్.. సామాన్యులకు ఎప్పుడూ ఓ బ్రహ్మ పదార్థమే. ఓ పట్టాన ఎవరికీ అర్థమయ్యి చావదు. అందుకే నిపుణుల సూచనలు, సలహాలు ఎప్పుడూ అవసరమే. అది లేకపోతే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసే సమయంలో తప్పులు దొర్లుతాయి. వాటిని గుర్తించి సరిచేసుకోకపోతే పర్యావసానాలు అనుభవించాల్సి వస్తుంది. అనేక రకాల ఫైన్లు కూడా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆదాయ పన్ను ను ఎలా దాఖలు చేయాలి? అందుబాటులో ఉండే ఫారాలు ఏమిటి? ఆన్ లైన్ ప్రాసెస్ ఏంటి? దీని వల్ల పన్ను చెల్లింపు దారులకు ఒనగూరే ప్రయోజనాలు ఏంటి? ఓ సారి చూద్దాం..
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) అనేది ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయ వివరాలను సూచించే ఒక ఫారమ్. మీ ఆదాయానికి సంబంధించిన ఆ ఫారమ్ ను ఎంపిక చేసుకొని దానిలోని అన్ని అంశాలను కూలంకషంగా అర్థం చేసుకొని పూరించి ఆదాయ పన్ను శాఖకు నివేదించడమే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడం. ఆ తర్వాత తదనంతరం ఇది ఆదాయపు పన్ను శాఖ నుండి లాస్ ని ‘క్యారీ-ఫార్వర్డ్’ చేయడం లేదా రీఫండ్ కోసం క్లెయిమ్ చేసుకొనే వీలుంటుంది.
ఫారాలను ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలి.. ఆదాయ స్వభావాన్ని బట్టి రిటర్న్ ఫైలింగ్‌లో వివిధ రూపాలు ఉన్నాయి. అవి వివిధ ఫారాలలో అందుబాటులో ఉంటాయి. వాటిని https://www.incometax.gov.in/iec/foportal నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పన్ను చెల్లింపుదారులు గడువు తేదీలోపు ఐటీఆర్ ఫారమ్‌ను సరిగ్గా పూరించాలని గుర్తుంచుకోండి.
ఫారాలు ఏంటి.. ఆదాయపు పన్ను చట్టం కింద, వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులకు వివిధ రకాల రిటర్న్‌లు సూచించబడతాయి. వాటికి వివిధ రకాల ఫారాలు అందుబాటులో ఉంటాయి. వాటని ఐటీఆర్ ఫారమ్‌లు అంటారు. అసెస్‌మెంట్ సంవత్సరం 2023-24 (అంటే, ఆర్థిక సంవత్సరం 2022-23) కోసం ఆదాయపు రిటర్న్‌ను దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను చట్టం కింద సూచించిన రిటర్న్ ఫారాలు ఇవి.. ఈ సంవత్సరం, సీబీడీటీ, ఐటీఆర్ ఫారమ్‌లను 1-6, అలాగే ఐటీఆర్-వీ (ధృవీకరణ ఫారమ్), ITR రసీదు ఫారమ్‌లను ముందుగానే తెలియజేసింది. ఇది పన్ను చెల్లింపుదారులకు వాటిని సిద్ధం చేయడానికి తగినంత సమయాన్ని ఇస్తుంది.
అలాగే సెక్షన్ 139(1) ప్రకారం ఫారమ్ ఐటీఆర్-1లో సీబీడీటీ కొన్ని మార్పులు చేసింది. వార్షిక పన్ను విధించదగిన ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా దాఖలు చేయవచ్చు. ఈ వ్యక్తులు వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.1 కోటి దాటినా వారి ఐటీఆర్ ఫారమ్‌లలో రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు.
అనుకూలమైన ఫారం ఎంపిక ఇలా.. ఐటీఆర్ ఫారమ్ గురించి మీకు కచ్చితంగా తెలియకపోతే, మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ‘Help me decide which ITR Form’ని ఎంచుకుని, ‘Proceed’ క్లిక్ చేయండి. అప్పుడు సిస్టమ్ మిమ్మల్ని మీకు అనుకూలమైన ఫారం ఎంచుకునేందుకు సాయపడుతుంది.
ఎలా ఫైల్ చేయాలి.. ఆదాయపు పన్ను శాఖ ఆదాయ రిటర్న్‌ల ఇ-ఫైలింగ్ కోసం పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఆదాయ రిటర్న్‌ను ఇ-ఫైల్ చేయడానికి పన్ను చెల్లింపుదారులు https://www.incometax.gov.in/iec/foportal కి లాగిన్ చేయవచ్చు. లేదా ఆదాయపు రిటర్న్‌ను ఆదాయపు పన్ను శాఖ స్థానిక కార్యాలయంలో హార్డ్ కాపీలో ఫైల్ చేయవచ్చు
ప్రయోజనాలు ఏమిటి.. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం మీ విధి. ఇలా చేయడం ద్వారా మీరు దేశాభివృద్ధికి స్పృహతో సహకరిస్తున్నట్లు లెక్క. అలాగే, మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఆర్థిక సంస్థల ముందు మీ క్రెడిట్ యోగ్యతను ధృవీకరిస్తాయి. మీరు పనులను సులభతరం చేయడానికి బ్యాంకు నుండి రుణం తీసుకోవడం వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..