ఇమ్రాన్‌ లక్ష్యంగా పాకిస్తాన్‌లో ఒక్కటైన విపక్షాలు, కరాచీలో భారీ ర్యాలీ

పాకిస్తాన్‌లో విపక్షాలన్నీ ఏకమయ్యాయి.. ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారుపై పిడికిలి బిగించాయి. ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు పోరాటం ఆపకూడదని ప్రతినబూనాయి.. పాకిస్తాన్‌ డెమొక్రాటిక్‌ మూవ్‌మెంట్‌- పీడీఎం పేరుతో ఏర్పాటైన విపక్ష కూటమి...

ఇమ్రాన్‌ లక్ష్యంగా పాకిస్తాన్‌లో ఒక్కటైన విపక్షాలు, కరాచీలో భారీ ర్యాలీ
Follow us
Balu

|

Updated on: Oct 19, 2020 | 10:27 AM

పాకిస్తాన్‌లో విపక్షాలన్నీ ఏకమయ్యాయి.. ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారుపై పిడికిలి బిగించాయి. ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు పోరాటం ఆపకూడదని ప్రతినబూనాయి.. పాకిస్తాన్‌ డెమొక్రాటిక్‌ మూవ్‌మెంట్‌- పీడీఎం పేరుతో ఏర్పాటైన విపక్ష కూటమి ఆదివారం రోజున కరాచీలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది.. వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులంతా ఇందులో పాల్గొన్నారు.. ఒకే వేదికను పంచుకున్నారు.. ఇమ్రాన్‌ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. ఇమ్రాన్‌ఖాన్‌ అంతటి అసమర్థుడైన ప్రధానిని తాము ఇంతవరకు చూడలేదన్నారు.. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా పాపం ఆయనకు తెలియడం లేదని ఎత్తిపొడిచారు పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత బిలావల్‌ భుట్టో జర్దారీ.. నియంతలకు ఏ గతి పట్టిందో ఇమ్రాన్‌కు కూడా అదే గతి పడుతుందని అన్నారు. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం ఈ ఆందోళనలో పాలుపంచుకున్నారు.. లండన్‌లో ఉంటున్న నవాజ్‌ అనారోగ్య కారణాల వల్ల క్రియాశీలక రాజకీయాలలో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు.. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌ పార్టీని ముందుండి నడుపుతున్నారు మరియం.. తన తండ్రి, తన పార్టీ మద్దతుదారులను ఇమ్రాన్‌ దేశద్రోహులని అనడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్‌ జాతిపిత మహ్మద్‌ అలీ జిన్నా సోదరి ఫాతిమా జిన్నాను కూడా ఇమ్రాన్‌ దేశ వ్యతిరేకులనడం ఆయనకే చెల్లిందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదీ సక్రమంగా చేయడం లేదని, అవినీతి రాజ్యమేలుతోందని మరియం విమర్శించారు. 2007లో జరిగిన జంట పేలుళ్లలో మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో మరణించి ఆదివారానికి 13 సంవత్సరాలు అయ్యింది. అందుకు గుర్తుగా ఈ భారీ ర్యాలీని నిర్వహించారు. ఇమ్రాన్‌ఖాన్‌ను పదవిలోంచి తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న 11 ప్రతిపక్ష పార్టీలు పీడీఎం పేరిట ఒక్కటయ్యాయి..