
Telangana state number one in Information Technology exports once again: కరోనా కష్ట కాలంలోను తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. ఐటీ ఎగుమతుల్లో తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఉత్తమ ఫలితాలు సాధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గురువారం నాడు అభినందించారు.
ఐటీ ఎగుమతుల వార్షిక నివేదికను సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ గురువారం నాడు అందజేశారు. ఐటీ శాఖ ఫలితాలను ముఖ్యమంత్రి అభినందించారు. కొవిడ్-19 ప్రభావంలోనూ ఐటీ ఎగుమతుల్లో సత్తా చాటడం చిన్న విషయమేమీ కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో 17.93 శాతం అభివద్ధి సాధించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ వివరించారు. గత ఐదేళ్లుగా దేశంలో ఐటీ ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఈసారి కూడా అదే ఫలితాన్ని సాధించింది.
దేశ సగటు ఐటీ ఎగుమతులు 8.09 శాతం కాగా.. మిగతా రాష్ట్రాల సగటు ఎగుమతులు 6.92%. మొత్తం భారతదేశ ఐటీ ఎగుమతుల్లో 11.6 శాతం తెలంగాణ నుంచి జరుగుతోంది. ఐటీ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని, ఐటీ వృద్ధి వల్ల తెలంగాణ ఎంప్లాయిమెంట్ గ్రోత్ 7.2 శాతం పెరిగిందని, కరోనా వైరస్‌ను నివారించేందుకు రాష్ట్రంలోని ఐటీ కంపెనీలు కూడా కృషి చేశాయని, 70 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు సమకూర్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.