తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజుల వరకు రెండు వేలకు తగ్గకుండా నమోదైన కేసులు.. తాజాగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం రాత్రి 8 గంటల వరకు 50,367 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,896 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,06,644కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కాగా, నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి వారిలో 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,201కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,067 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,79,075కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,368 యాక్టివ్ కేసులతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 21,724 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 33,96,839 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.