
మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవ వేడుక ఓ అద్భుతానికి వేదికగా మారింది. కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో 100 అంబులెన్స్ లు రెడీ అయ్యాయి. కరోనా మహమ్మారిపై పోరు సాగించేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన వంద అంబులెన్సులను నెల రోజుల్లోగా సమకూర్చేందుకు అంతా ఓకే చెప్పారు.
కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై కేటీఆర్ మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా కరోనా నేపథ్యంలో 6 అంబులెన్సుల కొనుగోలుకయ్యే ఖర్చును వ్యక్తిగతంగా భరిస్తానని కేటీఆర్ వెల్లడించారు. కరోనా టెస్టులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వీటిని ఉపయోగించుకునేలా అందులో అన్ని సౌకర్యాలు ఉంటాయని, గ్రామీణ ప్రాంతాల్లో వీటి సేవలు అందేలా చూడాలని కోరారు.
కేటీఆర్ ప్రతిపాదనకు స్పందించిన ఈటల కూడా కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్ పక్షాన 5 అంబులెన్సులు అందజేస్తానని ప్రకటించారు. ఇక అంబులెన్సులు సమకూర్చాలనే ప్రతిపాదనకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చారు. మొత్తంగా 32 జిల్లాలకు వంద అంబులెన్సులను నెల రోజుల్లో ఇవ్వాలని నిర్ణయించారు.