KCR to meet District Collectors: ఇవాళ జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక భేటీ.. పలు అంశాలపై చర్చ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో నిర్వహించనున్న సమావేశానికి రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నారు.

KCR to meet District Collectors: ఇవాళ జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక భేటీ.. పలు అంశాలపై చర్చ

Edited By:

Updated on: Jan 11, 2021 | 7:00 AM

KCR to meet all collectors: రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నేతృత్వంలో ఇవాళ జిల్లా కలెక్టర్లతో కీలక భేటీ జరగనుంది. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహించనున్న సమావేశానికి రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నారు. ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం మొదులు కానుంది. ఈ నేపథ్యంలో అయా జిల్లాలో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి, ధరణి, కొవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌, హరితహారం, నర్సరీల్లో మొక్కల పెంపకం, విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు తదితర అంశాలకు సంబంధించి చర్చించనున్నారు.

ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నారు. గత నెల 31న రెవిన్యూకు సంబంధించిన కీలక అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన పలు అంశాలపై సీఎం జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే సమావేశంలో ఈ అంశాలను మళ్లీ కూలంకషంగా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే, పెండింగ్‌ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనళ్ల ఏర్పాటు, పార్ట్‌–బీలో పెట్టిన భూముల పరిష్కారం తదితర అంశాలపై ఇవాళ్టి సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. భూవివాదాలకు సంబంధించి సత్వరం పరిష్కరించేందుకు కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

అలాగే, రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, నివారణ చర్యలు, కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై చర్చించనున్నారు. ప్రాధాన్యతా క్రమంలో పౌరులకు టీకా వేయడానికి సంబంధించిన పూర్తిస్థాయి కార్యాచరణను రూపొందించనున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిని సమీక్షించి తదుపరి విడత కార్యక్రమాల తేదీలను ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. హరితహారం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.