చిన్నారి అమ్మాయిలను, అబ్బాయిలను సొంత బిడ్డల్లా చూసుకొని విద్యాబుద్దులు నేర్పించాల్సిన పాఠశాల ఉపాధ్యాయుల్లో కొందరు కామాంధులై విద్యార్థినిలపై కీచకపర్వం సాగిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతవర్రే గ్రామంలో విద్యార్థినిలను వేధించిన టీచర్‌తో పాటు ఈ విషయంలో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించిన టీచర్లకు ఇప్పుడు తగిన శాస్తి జరిగింది. లక్ష్మీదేవి పల్లి మండలం చింతవర్రే గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు బాలికలపై ఓ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడగా తల్లిదండ్రులకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. ఆ తర్వాత కీచక టీచర్ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు ఐదుగురు ఉపాధ్యాయులు. ఇప్పుడు వారిని కూడా సస్పెండ్ చేశారు జిల్లా విద్యాశాఖ అధికారులు. తోలెం శేషగిరిరావు, పూనేం శ్రీనివాసరావు, జి వీరభద్రం, సిహెచ్ రామయ్య. జె లింగయ్య అనే ఐదుగురు టీచర్లను సస్పెండ్ చేశారు. ఈ ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు విద్యాశాఖతో పాటు కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీచేశారు.
ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉపాధ్యాయుడిపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే మిగతా ఉపాధ్యాయుల పై కూడా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున మహిళా సంఘాలు ఆందోళనలు దిగాయి. దీంతో తాజాగా వారిని కూడా సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వారిని లైంగికంగా వేధించినా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో నిందితుడిపై అప్పుడే కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ ఘటనలో నిందితుడికి సహకరించి, ఈ విషయాన్ని బయటకి రాకుండా చూసేందుకు ప్రయత్నించిన మిగతా ఐదుగురు టీచర్లపై కూడా ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడింది. ఇది విద్యార్థినులను లైంగికంగా వేధించే మిగతా టీచర్లకు, వారిని కాపాడాలనుకునే వారికి తగిన గుణపాఠంగా మారనుంది.