ఏపీ రాజకీయ రాజధాని విజయవాడ సోమవారం పోటాపోటీ ధర్నాలతో హోరెత్తింది. ఏడు లక్షల మందికి పెన్షన్లను రద్దు చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త ధర్నాలకు అనుగుణంగా టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు ధర్నాచౌక్‌లో భారీ ధర్నా నిర్వహించగా.. దానికి పోటీగా వైసీపీ నేత దేవినేని అవినాశ్ భారీ ర్యాలీ నిర్వహించి తెలుగుదేశంపార్టీ నేతలదంతా అసత్యప్రచారమని చెప్పే ప్రయత్నం చేశారు.
ధర్నాచౌక్‌లో ధర్నాచేసిన బొండా ఉమా.. వైసీపీ ప్రభుత్వం పేదల పొట్ట కొడుతుందని ఆరోపించారు. లక్షలాది మంది పెన్షన్లను రద్దు చేసి.. కిరాతక పాలననందిస్తోందని ఆరోపించారు. విజయవాడతోపాటు కడప, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెన్షన్లు, రేషన్ కార్డుల రద్దుపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. తెలుగుదేశం పార్టీ ధర్నాలకు మద్దతుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఒకే సారి 7 లక్షల పెన్షన్లు ఎత్తేసారు. ఆఖరికి దివ్యాంగుల పెన్షన్ కూడా తీసివెయ్యడానికి మీకు మనస్సు ఎలా వచ్చింది? ఎత్తేసిన పెన్షన్లు తిరిగి ఇచ్చే వరకూ అవ్వా, తాతలు, దివ్యాంగుల తరపున మొండి ప్రభుత్వం పై టిడిపి పోరాడుతుంది. (3/3)#JaganFailedCM
— Lokesh Nara (@naralokesh) February 10, 2020
‘‘ జగన్ గారి మొదటి సంతకమే మాయ. మాట మార్చి, మడమ తిప్పి పెన్షనర్లను మోసం చేసారు. నేను విన్నాను, నేను ఉన్నాను 3 వేల పెన్షన్ పక్కా అన్న జగన్ గారు నేను వినలేదు, నేను లేను అంటూ 250 రూపాయిలు పెంచి అవ్వా, తాతలను దగా చేసారు. రాజన్న రాజ్యంలో 60 ఏళ్లకే పెన్షన్ అని 8 నెలలు అయినా 60 ఏళ్లు దాటిన ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా రాక్షస రాజ్యాన్ని తలపిస్తున్నారు. పండుటాకుల పై జగన్ గారికి అంత కక్ష ఎందుకో అర్ధం కావడం లేదు. ఒకే సారి 7 లక్షల పెన్షన్లు ఎత్తేసారు. ఆఖరికి దివ్యాంగుల పెన్షన్ కూడా తీసివెయ్యడానికి మీకు మనస్సు ఎలా వచ్చింది? ఎత్తేసిన పెన్షన్లు తిరిగి ఇచ్చే వరకూ అవ్వా, తాతలు, దివ్యాంగుల తరపున మొండి ప్రభుత్వంపై టిడిపి పోరాడుతుంది’’ అంటూ ట్వీట్ చేశారు లోకేశ్.
గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాలలో కూడా టీడీపీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. మరోవైపు టీడీపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏలూరురోడ్డు బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి శాతవాహన కళాశాల రోడ్డులోని మీసేవ ఆఫీస్ వరకు ర్యాలీ జరిపారు. టీడీపీ పేమెంట్ బ్యాచ్‌లతో ధర్నాలు చేస్తుందని అవినాశ్ ఆరోపించారు. అసలు పెన్షన్ దారులతో తాము ర్యాలీ తీశామని ఆయనన్నారు.