ఏపీలో పరువు నష్టం దావాల హోరు

|

Jan 04, 2020 | 1:57 PM

మూడు రాజధానుల ప్రస్తావన ఏమో గానీ ఇపుడు ఏపీలో పరువునష్టం దావాలు హోరెత్తిస్తున్నాయి. రాజధాని ఏరియాలో భూములు మీరు కొన్నారంటే మీరు కొన్నారంటూ వైసీపీ, టీడీపీ నేతలు వాదులాడుకుంటున్నారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే పార్టీ నేతలకు లీక్ చేశారని, దాంతో టీడీపీ నేతలు అమరావతిలో భూములను కొని ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో […]

ఏపీలో పరువు నష్టం దావాల హోరు
Follow us on

మూడు రాజధానుల ప్రస్తావన ఏమో గానీ ఇపుడు ఏపీలో పరువునష్టం దావాలు హోరెత్తిస్తున్నాయి. రాజధాని ఏరియాలో భూములు మీరు కొన్నారంటే మీరు కొన్నారంటూ వైసీపీ, టీడీపీ నేతలు వాదులాడుకుంటున్నారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే పార్టీ నేతలకు లీక్ చేశారని, దాంతో టీడీపీ నేతలు అమరావతిలో భూములను కొని ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

వైసీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, పరిటాల శ్రీరాం, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ళ నరేంద్ర వంటి వారికి భూములున్నట్లు పేర్కొన్నారు. దాంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. భూములు లేనివారిని, ఎప్పుడో గతంలో భూములు కొన్న వారిని ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణల పరిధిలోకి తేవడాన్ని వారు ఖండించారు. కంభంపాటి వంటి నేతలు తాము 2006లో కొన్న భూములను 2014 తర్వాత కొన్నట్లుగా వైసీపీ నేతలు పేర్కొని, తన పరువుకు నష్టం కలిగించారంటూ డిఫర్మేషన్ కేసు వేసేందుకు రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. పరిటాల శ్రీరామ్, ధూళిపాళ్ళ నరేంద్ర కూడా వైసీపీ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు.

మరోవైపు తాజాగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ప్రకటించే ముందే వైసీపీ నేతలు వైజాగ్‌లో పెద్ద ఎత్తున భూములు కొన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బొత్స సత్యనారాయణతోపాటు పలువురు వైసీపీ నేతలు విశాఖలో భూములు కొన్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజం లేదంటున్న వైసీపీ నేతలు ఈ ఆరోపణలు చేసిన తెలుగుదేశం నాయకులపై పరువునష్టం దావాలను వేస్తామని ప్రకటిస్తున్నారు.

మొత్తమ్మీద రాజధాని రచ్చ ఏమో గానీ భూముల కొనుగోళ్ళే ఇప్పుడు టీడీపీ, వైసీపీ నేతల మధ్య పంచాయితీకి దారితీస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా భూములు కొన్నారో తేలేది.. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నిగ్గు తేల్చేది ఇక న్యాయస్థానాలేనేమో!