ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ వాలంటీర్ వ్యవస్థపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఐదు వేల రూపాయల జీతంతో గోనె సంచులు మోసే ఉద్యోగాన్ని ఇచ్చారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ వాలంటీర్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, ఇటీవల ఓ యువతిపై గ్రామ వాలంటీర్ లైంగిక వేధింపులకు దిగడని, అది సాధ్యం కాకపోవడంతో మరో అమ్మాయితో రాయభారం నడిపాడని..దీంతో ఆ యువతి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని, వైసీపీ పాలనలో ఇంకెన్ని అకృత్యాలను చూడాలో అర్ధం కావడం లేదంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
గ్రామవాలంటీర్ల ఉద్యోగాలను ఎవరు ఇమ్మన్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఉద్యోగాలతో లాభం ఏమిటన్నారు. ఇంట్లో భర్తలు లేని సమయంలో వాలంటీర్లు ఇళ్లకు వెళ్తున్నారని, ఎప్పుడంటే అప్పుడు తలుపులు కొడుతూ నీచానికి పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి చూస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతుందన్నాను. గ్రామ వాలంటీర్లతో ప్రమాదం వచ్చి పడిందంటూ ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు