టాలెంటెడ్ ఆర్టిస్ట్ తాప్సీకి ముంబయి అదానీ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కరెంటు బిల్లు రూపంలో భారీ షాక్ ఇచ్చింది. ముంబయిలోని తన నివాసానికి విద్యుత్ రీడింగ్ బిల్లును అధికంగా వేశారని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది తాప్సీ. కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో మూడు నెలలుగా పవర్ బిల్లు తీయకుండా వాటన్నిటిని తాజాగా పంపారు. అయితే అన్ని శ్లాబులనూ కలిపి ఒక్కనెలలోనే వడ్డించడంతో రూ.36 వేల విద్యుత్ బిల్లు అయ్యింది. అయితే సాధారణ రోజుల కన్నా మూడు రెట్లు అధికంగా బిల్లు రావడం వల్ల ట్విట్టర్ వేదికగా తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది.
“మూడు నెలల కరోనా లాక్డౌన్లో ఎలాంటి కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు నా అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకోలేదు, ఉపయోగించలేదు. కానీ, చివరి నెలలో మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్లు ఊహకందనంతగా పెరిగిపోయింది. ముంబయి అదానీ ఎలక్ట్రిసిటీ.. మా నుంచి మీరు ఎటువంటి ఎలక్ట్రిసిటి బిల్లు వసూల్ చేస్తున్నారు” అని తాప్సీ ట్విట్టర్ లో ప్రశ్నించింది.
తాప్సీ ఇంటి కరెంట్ వినియోగానికి సంబంధించి మూడు నెలలకు వచ్చిన విద్యుత్ బిల్లులలో ఒక్క జూన్‌లోనే రూ.36 వేలకు రిసిప్ట్ పంపారు. మే నెలలో మాత్రం కేవలం రూ.3,850 బిల్లు వచ్చినట్లు ఉంది. తనకున్న మరో అపార్ట్మెంట్లో ఎవరూ నివశించరని, కేవలం వారం వారం శుభ్రపరచడానికే వెళ్తామని తెలిపింది. అక్కడ కూడా రూ.8,640 విద్యుత్ బిల్లును విధించారని వాపోయింది. అధిక విద్యుత్ బిల్లులపై ఇప్పటికే చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం వేసిన సంగతి తెలిసిందే.