Kane Williamson Moves Top: ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మొదటి టెస్టులో శతకొట్టిన ‘కేన్ మామ’ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 890 పాయింట్లతో టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(879), ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్(877) వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఇదిలా ఉంటే టెస్ట్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీలను అధిగమించడంపై విలియమ్సన్ స్పందించాడు.
‘ప్రస్తుతం వారిద్దరే(కోహ్లీ,స్మిత్) అత్యుత్తమ క్రికెటర్లు. నేను వారిని అనూహ్యంగా అధిగమించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంతో గౌరవంగానూ ఉంది. జట్టు కోసం అత్యుత్తమైన ప్రదర్శన ఇవ్వడంలో ర్యాంకులు వాటంతట అవే వస్తాయి. అప్పుడప్పుడూ వ్యక్తిగత ర్యాంకులను నేను కూడా చూస్తుంటాను. ఏది ఏమైనా జట్టు గెలుపు కోసం పోరాటం చేయడమే నాకు ఎక్కువ కిక్కిస్తుంది’ అని విలియమ్సన్ పేర్కొన్నాడు. కాగా, మెల్‌బోర్న్ టెస్టులో అదరగొట్టిన రహనే 5 స్థానాలు ఎగబాకి.. 6వ ర్యాంక్‌కి చేరుకున్నాడు.అలాగే టాప్ 10లో లబూషేన్(4), అజామ్(5), వార్నర్(7), స్టోక్స్(8), రూట్(9), పుజారా(10) ఉన్నారు.