లాక్ డౌన్ రోజుల్లోనూ బీఎస్-4 వాహనాలను విక్రయించడంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చి 31తో బీఎస్-4 వాహనాలకు తుది గడువు నిర్దేశిస్తే.. మార్చి 31 తర్వాత కూడా బీఎస్-4 వాహనాల అమ్మకాలు కొనసాగాయని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే బీఎస్-4 రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ ఆగస్టు 13కి వాయిదా వేసింది.
లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా బీఎస్-4 వాహనాలు మిగిలిపోయాయంటూ ఆటోమొబైల్ డీలర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు 10 రోజుల వ్యవధిలో 10 శాతం బీఎస్-4 వాహనాలను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే… నిర్దేశించిన శాతం కంటే ఎక్కువ మొత్తంలో బీఎస్-4 వాహనాలు అమ్ముడవడం సుప్రీం కోర్టును అసహనానికి గురిచేసింది. దీంతో బీఎస్-4 రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది.