Minister KTR directed officials on Coronavirus preventive steps: తెలంగాణలో కరోనా వైరస్ తొలి పాజిటివ్ కేసు బయటపడడంతో కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ రంగంలోకి దిగారు. గాంధీ ఆసుపత్రిలో తీసుకోవాల్సిన చర్యలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ప్రివెంటివ్ చర్యలను చేపట్టేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగానికి మరీ ముఖ్యంగా వైద్య, ఆరోగ్య శాఖకు నిర్దిష్టమైన ఆదేశాలను జారీ చేశారు మంత్రులు కేటీఆర్. ఈటల రాజేందర్.
రాష్ట్రంలో కరోనా వైరస్ తొలి కేసును గుర్తించిన నేపథ్యంలో మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖతోపాటు వివిధ శాఖలకు అధిపతులు, ఉన్నతాధికారులు కరోనా ప్రివెంటివ్ స్టెప్స్‌పై చర్చించారు.
కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు కనిపించిన వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు. 24 గంటల పాటు పనిచేసే కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని ఆదేశించారు. గతంలో వచ్చిన ఇతర వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్‌లో మరణాల రేటు అతి తక్కువగా ఉంటుందన్న అభిప్రాయం ఈ రివ్యూ మీటింగ్‌లో వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మంత్రులు తెలిపారు. కరోనా పాజిటివ్ వస్తే ఖచ్చితంగా మనిషి చనిపోతాడన్న ప్రచారంలో వాస్తవం లేదని చెబుతున్నారు తెలంగాణ మంత్రులు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రులు చెబుతున్నారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో కరోనా మెడికేషన్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో వైరస్‌కి సంబంధించిన నిజాలను ప్రజలను చైతన్యం చేసే దిశగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని మంత్రులు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇందుకోసం సమాచార మరియు ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, తెలుగు ,ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రజలకు కరోనా వైరస్ పైన అవగాహన కల్పించే సమాచారం అందించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. కరోనా వైరస్ సమస్యని ఉపయోగించుకొని ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కరోన వైరస్‌పై అసత్యాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు హెచ్చరించారు.